
గతేడాది లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఖజానా కుప్పకూలింది. దీంతో మరోసారి లాక్‌డౌన్ అంటే రాష్ట్రాలు భయపడే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ పెట్టే సమస్యే లేదని అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించేశారు. సెకండ్ వేవ్ ప్రారంభమైనా లాక్‌డౌన్‌కు ఏ రాష్ట్రం ముందుకు రావడం లేదు. ఏపీలో కూడా కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి సీఎం పాక్షిక లాక్‌డౌన్‌కు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ఓ మండలంలో ఈ పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ పెడుతున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్ ప్రకటించారు. వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. కొవిడ్ కేసులు అధికంగా రావడంతో లాక్‌డౌన్ ప్రకటించినట్లు తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఏపీలో బుధవారం 1,184 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కరోనా కేసులు పెరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ పెట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. మొదటి వేవ్ సమయంలో అధికారులు సమర్థవంతంగా పని చేశారని ప్రశంసలు దక్కాయి. అయితే.. ఎలాగోలా ఫస్ట్ వేవ్ నుంచి రాష్ట్రం బయటపడింది. ఇప్పుడు రెండో వేవ్ మరీ ఎక్కువగా ప్రబలకుండా అధికారులు ముందుగానే లాక్‌డౌన్ లాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు.
మరోవైపు.. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయబోతున్నారు. ఇప్పటివరకు 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు, 45 దాటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రమే టీకాలు వేశారు. ఇవాళ్టి నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవచ్చు.