కేటీఆర్ కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ మరోసారి ప్రచారం తెరమీదకు ఎందుకు వచ్చినట్లు..? మొన్నటికి మొన్న రెండు ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్‌ఎస్ పార్టీ.. మళ్లీ ఈ కొత్త పల్లవిని ఎందుకు ఎత్తుకున్నట్లు..? కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చొబెట్టేందుకే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను విడిచి రావడం లేదా..? అక్కడే కేటీఆర్ సీఎం బాధ్యతలు అప్పగించే ముహూర్తం ఖరారు చేస్తున్నారా..? కేటీఆర్‌కు సీఎం సీటు అప్పగించడం ఇదే మంచి తరుణమని కేసీఆర్ భావనకు వచ్చారా..? కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టి కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక అయ్యాయి. ఈ ప్రచారమైనా ఈసారి వాస్తవం అవుతుందా.. లేదా ఎప్పటిలాగే కేసీఆరే ఈ మూడేండ్లు సీఎంగా ఉంటారంటూ వివరణలు వస్తాయా..? చూడాలి మరి.
*ఈ మూడేండ్ల పాలన కేటీఆర్‌కు పరీక్ష పెట్టేందుకేనా..?
కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయం అని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి మరో మూడేండ్లు గడువు ఉండడం.. 2023 వరకు టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుండడంతో ఇదే మంచి ఛాన్స్ అని కేసీఆర్ భావిస్తున్నారట. ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా మరో రెండేండ్లపాటు అధికారానికి ఎలాంటి ఢోకా లేదు. ఇప్పుడు కేటీఆర్‌ను సీఎం చేస్తే.. పాలనలో తనను తాను నిరూపించుకునేందుకు కావాల్సినంత సమయం దొరుకుతుందని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. ‘కేటీఆర్ ను సీఎం చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని నెరవేర్చేందుకు ఇప్పుడే కరెక్ట్ టైం. కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీకి మంచి జోష్ వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కేటీఆర్‌కు ఇప్పుడు సీఎం పదవి ఇవ్వకపోతే ఆయన భవిష్యత్ లో సీఎం అయ్యే ఛాన్స్ తక్కువని లీడర్లు అంటున్నారు. ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌కు భవిష్యత్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆలోచన నేతల్లో నెలకొంది.
*జనవరి లేదా ఫిబ్రవరిలోనే బాధ్యతలు..!
అందుకే.. ఇప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం టీఆర్‌ఎస్‌లో మళ్లీ జోరందుకుంది. త్వరలోనే అధికార మార్పిడి జరుగుతుందని నాయకులు చెబుతున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలోనే కేటీఆర్‌కు సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని, ముహూర్తం దాదాపు ఖరారైందని వారు అంటున్నారు. సంక్రాంతి ముందైనా.. లేక ఆ తర్వాత అయినా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే.. గతంలోనూ ఇలాంటి ప్రచారాలు బాగానే జరిగాయి. స్వయంగా మంత్రులే వారి నోట ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, కేటీఆర్ తోసిపుచ్చటంతోపాటు కేసీఆర్‌కూడా అలాంటిదేమీ లేదని, కొంతకాలం తానే సీఎంగా ఉంటానని స్పష్టత ఇచ్చారు. ఇటీవల కేసీఆర్ఢిల్లీ టూర్ నుంచి వచ్చాక జరుగుతున్న పరిణామాలు, ప్రచారాన్ని చూస్తుంటే కేటీఆర్‌కు పట్టాభిషేకం నిజమయ్యేలా ఉందని పొలిటికల్నిపుణులు భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక కేసీఆర్ 13 రోజులుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లటం కొత్తేమీ కాదు. కానీ.. రెండు వారాలుగా అక్కడే ఉంటున్నారు. పైగా వరుసగా కుటుంబ సభ్యులతో అక్కడే సమావేశాలు పెట్టుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కేటీఆర్‌ను సీఎం చేసే విషయంపైనే కసరత్తు జరుగుతోందని పార్టీ లీడర్లు నమ్ముతున్నారు.
*కుటుంబంలో ఏకాభిప్రాయం
అధికార మార్పిడిపై కేసీఆర్ కుటుంబం ఏకాభిప్రాయానికి వచ్చిందని సమాచారం. జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత కేటీఆర్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి కుటుంబసభ్యులంతా వచ్చారట. కేటీఆర్‌ను సీఎం చేస్తే మంత్రి హరీశ్ రావుకు ఏ హోదా పదవులు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో హరీశ్‌కు కీలకమైన బాధ్యతలు ఇవ్వొచ్చని సమాచారం.
*ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు
కేటీఆర్ పట్టాభిషేకంతోపాటు అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలో ప్రక్షాళన జరగొచ్చని టీఆర్ఎస్‌లో చర్చ నడుస్తోంది. తొలి ప్రభుత్వంలో ఉన్నట్టు ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమిస్తారని నేతలు అంటున్నారు. పార్టీలో రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నాలుగు పదవులను సామాజిక సమీకరణల ప్రకారం నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహమూద్ అలీతోపాటు, ఒక మహిళా మంత్రిని డిప్యూటీ సీఎం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని టాక్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరీశ్ రావుతోపాటు మొదట్నించి పార్టీలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌ను నియమించొచ్చని భావిస్తున్నారు.
* హరీశ్‌కు కీలక బాధ్యతలు
కేటీఆర్‌ను సీఎం చైర్‌లో కూర్చోబెడితే మంత్రి హరీశ్ రావుకు పార్టీలో.. ప్రభుత్వంలో కీలక పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలతోపాటు కేటీఆర్ కేబినెట్‌లో ఆర్థిక శాఖతోపాటు కీలకమైన రెవెన్యూ, పురపాలక శాఖలను ఆయనకు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంతకాలం హరీశ్‌కు సరైన పదవులు ఇవ్వలేదనే ప్రచారానికి చెక్ పెట్టినట్టు అవుతుందని నేతల భావన.
*పట్టాభిషేకానికి ముందే అందరికీ ప్యాకేజీలు
కేటీఆర్‌ను సీఎం చేసేలోపే ప్రభుత్వంపై కోపంగా ఉన్న వర్గాలను సంతృప్తిపరిచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, పార్టీ కేడర్‌కు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని వారు అంటున్నారు. ముందుగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నియామకాలకు జోనల్ అంశం అడ్డంకి రాకుండా ఉండేందుకు ఏ చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో కేసీఆర్ మాట్లాడుతున్నారట. మరోవైపు.. రెండేండ్లుగా పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటించేందుకు కూడా చర్చలు నడుస్తున్నాయట. దీనిపై త్వరలోనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేసీఆర్మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. పార్టీ కేడర్ ను సంతృప్తి పరిచేందుకు నామినేటడ్ పదవులను భర్తీ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
*యాదాద్రి, పోలీస్ టవర్స్‌ను ప్రారంభించేది కేసీఆరే..
యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆఫీసర్లను సీఎం కేసీఆర్ఆదేశించినట్టు సమాచారం. జనవరి 31లోపు ప్రధాన ఆలయం, భక్తులకు అవసరమైన పనులను పూర్తి చేయాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో సీఎంవో ఆఫీసర్లు నిర్ణీత గడువులోపు ఆలయ పనులను పూర్తి చేయడంపై ఫోకస్‌పెట్టారు. జనవరి 31లోపు ప్రధాన ఆలయంలోకి భక్తులు వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్ పక్కన నిర్మిస్తున్న పోలీస్ టవర్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెండింటినీ కేసీఆర్ తాను సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభించేందుకు ఇంట్రెస్టు చూపుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
* మరి కేసీఆర్ ఏం చేస్తరు?
కేటీఆర్‌ను సీఎం చేశాక కేసీఆర్ ఏం చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడంపై ఆయన ఫోకస్ పెడతారని లీడర్లు చెప్తున్నారు. ప్రగతిభవన్ నుంచి బయటికి వచ్చి తన సొంతింటికి మకాం మారుస్తారని హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు. వారంలో రెండు మూడుసార్లు తెలంగాణ భవన్‌కు రావొచ్చని, మిగతా రోజుల్లో ఫామ్ హౌస్ కు వెళ్లి తనకు ఇష్టమైన పంటల సాగుపై ఫోకస్ పెట్టొచ్చని ఆయన చెప్పారు.