https://oktelugu.com/

కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు

ఇంతకీ నా ఊరేది..! ‘‘పుట్టిందోకాడా.. సదివింది మరోకాడా.. బతికేది పట్నంలా.. కరోనా జిందగీని ఉల్టాపల్టా చేసింది.. ఇప్పుడు నేనేక్కడికి పోవాలె. పుట్టిన ఊరికి పోవాల్నా… అక్కడేవరున్నారు..? సదువుకున్న కాడికెళ్లాలా.. చుట్టపు చూపు తప్పా మరేమీ లేకపాయే.. పట్నంల ఉండల్నా.. ఉండలేవ్పొమ్మనవట్టే… మరినేనేడికి పోవాలే..?’’ మేం పడ్డ కష్టాలు మీరు పడొద్దు బిడ్డా అంటూ అమ్మనాన్న మంచిగ సదువుకోవాలని చెప్పిళ్లు. ఊళ్లో సదివితే సోపతి ఎక్కువై పాడైతనని చుట్టాల ఇంట్లో ఉంచి బడికి తోలిండ్రు. పుట్టిన ఊళ్లో నాకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 11:04 AM IST

    Journalists

    Follow us on

    ఇంతకీ నా ఊరేది..!
    ‘‘పుట్టిందోకాడా..
    సదివింది మరోకాడా..
    బతికేది పట్నంలా..
    కరోనా జిందగీని ఉల్టాపల్టా చేసింది..
    ఇప్పుడు నేనేక్కడికి పోవాలె.
    పుట్టిన ఊరికి పోవాల్నా…
    అక్కడేవరున్నారు..?
    సదువుకున్న కాడికెళ్లాలా..
    చుట్టపు చూపు తప్పా మరేమీ లేకపాయే..
    పట్నంల ఉండల్నా..
    ఉండలేవ్పొమ్మనవట్టే…
    మరినేనేడికి పోవాలే..?’’
    మేం పడ్డ కష్టాలు మీరు పడొద్దు బిడ్డా అంటూ అమ్మనాన్న మంచిగ సదువుకోవాలని చెప్పిళ్లు. ఊళ్లో సదివితే సోపతి ఎక్కువై పాడైతనని చుట్టాల ఇంట్లో ఉంచి బడికి తోలిండ్రు. పుట్టిన ఊళ్లో నాకు తెలిసినోళ్లు తక్కువ. పండుగ.. పబ్బానికి పోతే ఇంటి పక్కన ఉన్నోళ్లో.. లేక తోటి వయస్సుల్లో కొంచెం ఎరుకయిండ్లు. ఇగ సదువు పూర్తి కాగానే ఉద్యోగమంటూ పట్నం పోయినా..ఊరి బాట తొక్కుడు తక్కువైంది. పని బిజీలో ఉన్న సోపతిగాండ్లకు ఫోన్చేసుడు మరిచినా.. ఇగ పెళ్లి చేసుకున్నాకా కుటుంబ.. ఉద్యోగం.. జీవితం ఈ మూడే కనిపించినై. ఉన్నతంగా బతకాలనే ఆశతో అందరినీ మరిచిన. ఉద్యోగమే నేనుగా బతికిన. కాలంతో పరుగు పెట్టినా. ఉన్న బంధాలు తెగిపోయినై. కష్టమస్తే పలుకరించే వాళ్లే లేరు. పట్నం కదా.. పక్కనున్నోళ్లు కూడా బిజీ. వారికీ వారి జీవితం.. వారి కుటుంబం. ఇక మనతో ముచ్చట్లు ఎక్కడివి. అంతా యాంత్రిక జీవనం. అలా అక్కడా ఎవరూ లేకుండా బతికీడ్చిన.
     

    Also Read: సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం..

      • జీవితం కంగాలైంది..
        జీవితంలో ఇంత పెద్ద ఆపద వస్తదనుకోలే. కరోనా జీవితాన్ని కంగాలు..కంగాలు చేసింది. బతుకుమీద భయాన్ని తెచ్చింది. బయటికి వెళ్లకుండా చేసింది. మరి బయటికి పోకపోతే బతికేదెట్లా..! కరోనాకు ప్రంపచమే వణకింది. ఇట్లనే ఉండాలని శాసించింది. ఇంకేముంది కంపెనీలు దివాలా తీశాయి. ఉద్యోగాలు పీకాయి. బతుకు బజార్ల పడింది. పట్నంలో విపరీతంగా కరోనా కేసులు. ఉపాధి కోసం రమ్మన్న పట్నమే.. ఇగా ఇప్పుడు ముల్లెమూట సదురుకొని పోమన్నది. ఇక్కడ ఉంటే బతకలేవంటూ తరిమిది. నీకిడా ఎవరూ లేరు..నీకెవరూ ఏమీ కారని బోధ చేసింది.
      •  మరి ఏడికి పోవాలె..
        సరిగ్గా గప్పుడే బుర్ర గిర్రున తిరిగింది. ఆలోచన మొదలైంది. భయం పట్టుకుంది. మెదట్ల అతలాకుతలమైంది. ప్రశ్నల మీద ప్రశ్నలు మనసును తొలిచివేశాయి. నేను ఎవరూ.. ఎక్కడ పుట్టాను.. ఎక్కడ పెరిగాను. ఏడ సదివినా.. ఏడ కొలువు చేస్తున్న అని. గిప్పుడెక్కడికి పోవాలె. ‘‘ఇంతకీ నా ఊరేదీ’’ అనే ఆలోచనలు బయలెల్లాయి. ఒళ్లంతా వణుకుడు పట్టింది. చెమటలు పట్టాయి. ఎట్లా బతకాలనే రద్దీ పట్టుకుంది. ఒక్కసారిగా నడి సంద్రంలో పడినట్లు అనిపించింది. చుక్కాని లేని నావ అయింది నా బతుకు. పుట్టింది ఓ కాడా.. సదువుకున్నది ఓ దగ్గరా.. కొలువు చేసేది పట్నంలా.. ఏదీ ఎంచుకోవాలె. ఏ ఆలోచన రావట్లే. మనసు కకావికలం అవుతున్నది. సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది. నా జీవితం ఏంది..? నా బాట ఎటూ అనే ఆలోచన వేధిస్తున్నది. అప్పుడు మొదలైంది నాలో ఓ ప్రశ్న.. ‘‘ఇంతకీ నా ఊరే ఏదీ’..!!
      •  పట్నంలనే ఉంటే..
        పీజీలు చేసిన. పట్టాలు తీసుకున్న. ఇన్నాళ్లు కాలర్ కు మరక అంటకుండా.., ఇస్ర్తీ నలుగుకుండా బతికిన. గిప్పుడు పల్లెకు పోవుడేంది.. ఉద్యోగం రాదా.. బతకలేమా.. అనుకుంటే గప్పటికే ధైర్యమనిపిస్తది కనీ.., ముందు సూత్తే ఏ తోవ లేదు. ఉద్యోగం మళ్లీ చేస్తమనే ఆలోచన అందడం లేదు. బడాబడా కంపెనీలే మూసేస్తున్నరు. ఏండ్లకేండ్లు అనుభవం ఉన్న సార్లను వద్దంటున్నరు. మనం ఓ లెక్కన. చిన్నాచితక ఉద్యోగమూ దొరకేలా లేదు. ఇన్నాళ్లు ఓ మెకానిజం లైఫ్ కు అలవాటు పడిన బతుకాయే.. మరోపని సహించడం లేదు. మరి ఎట్లా..? రోజులు ఎల్లదీసేదెట్లా..! అంతా అంధకారం. అద్దె కొంప..రోజు తిండితిప్పలు. కొలువు లేదాయే.. పైకం రాకపాయే. ఇక్కడ ఉంటే బతుకుమీద ఆశ సచ్చేలా ఉన్నది. అందుకే పట్నాన్ని ఇడిసి పెడుదామనుకున్న. ముల్లెమూట సదిరిన. అందరూ ఊళ్లకు పయనమవుతుంటే నేను పోదామనుకున్న అప్పుడు మొదలైంది ఆలోచన ‘ఇంతకీ నా ఊరేదని’..!!
      •  సదువుకున్నకాడికి పోతే..
        అక్కడ ఎవరున్నారు..? సుట్టంగా పోయి సదువుకున్నం. ఉన్నత చదువుల కోసం వారిని వదిలేసి మరెక్కడికో పోయిన. కలిసి సదువుకున్న దోస్తులను ఉద్యోగం.. సంపాదన, భార్యాపిల్లలు అంటూ మరిచిపోయిన. ఇప్పుడు నన్ను గుర్తుపట్టే బడి దోస్తులను ఎంకులాడడం కష్టం. మరి సుట్టాల ఇంటి దగ్గర ఉందామంటే.. ఉద్యోగం ఉన్నన్ని రోజులు పట్టించుకోని నన్ను వాళ్లు రానిస్తరా.. ఒకవేళా రానిచ్చినా నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్లేది. సరే అన్ని చంప్పుకొని పోయినా.. ‘సుట్టం మూడొద్దుల సంబురమే’ అన్నట్టుగా ఒకటి రెండు రోజులే. మరి జీవితాంతం ఎట్లా.. నా భార్యాపిల్లలు ఎలా..? అనే జఠిలమైన ప్రశ్నల్లోంచి మళ్లీ ఉదయించింది “ఇంతకీ నీ ఊరేదీ’’..?

    Also Read: కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!

    •  పల్లె రానిస్తుందా..!
      సదువులంటూ నా పల్లెకు దూరమైన. ఉద్యోగమంటూ పుట్టిన ఊరిని మొత్తానికే మరిసిన. పండుగ పబ్బానికి వచ్చినప్పుడు.. కలిసే స్నేహాన్ని నిలుపుకోలేక పోయిన.
      పక్క ఇండ్లల్లో ఉండే బంధాలను ఆప్యాయంగా పలుకరించలేక పోయిన. ఏదో నా ఆస్తి వాళ్లు గుంజుకున్నట్టు పట్నం నుంచి ఊళ్లకే వచ్చి సక్కగా ఇంట్ల సొత్తి. దుకాణానికి పోవాలే అన్నా.. అమ్మనాన్ననే పంపితి. బయటికి పోతే ఎక్కడ నా ఆస్తులు కరిగిపోతాయోననే ఇగో ఫీలింగ్తో పట్నంలా ఉన్నట్లే నాలుగు గోడల మధ్య టీవీ, కంప్యూటర్ అంటూ గడిపితిని. ఇగ నా ఊరిని నేనెప్పుడు సూత్తిని. నన్ను ఊరు ఎప్పుడు చూసే. ఊర్లో ఎవలు తెలిసినోళ్లు ఉన్నరు. ఎవ్వళ్లు తెల్వదు. ఉద్యోగం.., పైసల మాయలో పడి.. నాకు నేనే అనే యావలో బతికిన. బంధాలను మరిచినా. మా అమ్మనాన్నల పేర్లు చెబితే తప్పా నేను ఎవరికీ తెలియదు. పలుకుబడి లేకపాయే. మరి ఇప్పుడు నా ఊరు నన్ను గుర్తుపడుతుందా.. నన్ను రానిస్తుందా.. నేను మరిచిన తొవ నన్ను స్వాగతిస్తుందా..! బంధాలు నన్ను మళ్లీ అల్లుకుంటాయా..! నా పల్లె ‘తల్లి’ నన్ను కడుపున పెట్టి చూసుకుంటదా..! ఉపాధినిచ్చి మళ్లీ నా జీవితానికి చిగురినిస్తదా..! అసలు నా ఊరు నన్ను గుర్తుపడుతదా.! గుర్తు పట్టకపోతే.. రానివ్వకపోతే. ‘‘మరి ఇంతకీ నా ఊరేది’’..? నా బతుకేది..!

    “బతుకుపోరులో అన్ని మరిసి ఆగమైన మనిషిని నేను. ఇప్పుడు నా వాళ్లు అనే బంధాల కోసం పరుగెడుతున్న జీవిని నేనే. ఇదంతా కరోనా పుణ్యమే. నువ్వు ఒంటరి అని తెలిసేలా చేసింది. అసలు బతుకు ఇది కాదని జ్ఞానోదయం చేసింది. కొత్త బతుకుపై ఆశలు చిగురించేలా చేసింది.”

    – నాగరాజు పల్లెబోయిన