https://oktelugu.com/

జయహో ఇండియా: ప్రపంచ దేశాలకు మన టీకానే.. మనదే పెద్దన్న పాత్ర

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇండియాలో సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కోవిడ్‌ వైరస్‌ అటు ఆరోగ్యపరంగానూ.. ఇటు ఆర్థికంగానూ దెబ్బతీసింది. ఒకే కుటుంబంలో ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు.. అంటూ బలైపోవడంతో బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. పొలమో, ఇల్లో, బంగారమో అమ్మేసి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని కుటుంబాలు చూస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రులు నిలువునా దోచుకోవడాన్ని చూశాం. లక్షలు కుమ్మరించినా చివరకు డెడ్‌ బాడీలే ఇచ్చిన పరిస్థితులనూ కల్లారా చూశాం. ‘దేవుడా.. ఎందుకయ్యా మాకు ఇలాంటి దుస్థితి కల్పించావు’ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2021 / 08:54 AM IST
    Follow us on

    ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇండియాలో సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కోవిడ్‌ వైరస్‌ అటు ఆరోగ్యపరంగానూ.. ఇటు ఆర్థికంగానూ దెబ్బతీసింది. ఒకే కుటుంబంలో ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు.. అంటూ బలైపోవడంతో బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. పొలమో, ఇల్లో, బంగారమో అమ్మేసి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని కుటుంబాలు చూస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రులు నిలువునా దోచుకోవడాన్ని చూశాం. లక్షలు కుమ్మరించినా చివరకు డెడ్‌ బాడీలే ఇచ్చిన పరిస్థితులనూ కల్లారా చూశాం. ‘దేవుడా.. ఎందుకయ్యా మాకు ఇలాంటి దుస్థితి కల్పించావు’ అంటూ గుండెలవిసేలా ఏడ్చారు. కుటుంబ పెద్దలను బలిగొన్న వైరస్.. చాలా చోట్ల పిల్లలను అనాథల్ని చేసింది. అటు ఆర్థికంగానూ.. ఇటు కుటుంబ పరంగానూ భరోసా కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి..? తలచుకుంటేనే ఏదోలా ఉంది కదూ..!

    మూడు నెలల కిందటి మాట.. రోజూ దేశం మొత్తం లక్ష దాకా కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటికి ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అదే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అమెరికాను మించి రోజువారీ కేసులు వచ్చాయి. ఒక్కో ఆస్పత్రిలో బెడ్లూ చాలని పరిస్థితి. అవసరమైన వారికి వెంటిలేటర్లు దొరకని దుస్థితి. శవాలు గుట్టలయ్యాయి. కుటుంబాలు అనాథలయ్యాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మన అదుపులోకి వచ్చింది. రోజువారీ కేసులు, మరణాలు భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా మన వారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉండడం వల్లే చాలా మంది తట్టుకోగలిగారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గరే మరణాల రేటు తక్కువ.

    ఇక ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ను మనదేశ సైంటిస్టులే కనుగొన్నారు. వ్యాక్సిన్‌ వచ్చాక కరోనా ప్రభావం మరింత తగ్గిపోయింది. ఒక్కో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌లు సక్సెస్‌ అవుతూ.. ప్రపంచం పటం మీద జయహో భారత్‌ అంటూ గల్ల ఎగురవేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాలకు మన ఇండియాలో తయారైన వ్యాక్సిన్‌లను అందిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది.

    *దేశంలో 27 కోట్ల మందికి యాంటీబాడీలు
    మన దేశంలో 130 కోట్లకుపైగా జనాభా ఉండగా.. కోటీ 8 లక్షల మందికి కరోనా సోకింది. లక్షన్నర మందికిపైగా చనిపోయారు. నాలుగు రోజుల కిందట చేసిన సీరో సర్వేలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా యాంటీబాడీలున్నట్టు తేలింది. 28,600 మంది రక్త నమూనాలను పరిశీలించి ఈ విషయం తేల్చారు. ఆ లెక్కన దేశంలో 22 శాతం మందిలో కరోనా యాంటీబాడీలున్నట్టు అధికారులు లెక్కలేశారు. అంటే జనవరి నాటికే దేశ జనాభాలో 27 కోట్ల మందికి ఆల్రెడీ కరోనా సోకి ఉంటుందని అంచనా వేశారు. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే 56 శాతం మందికి యాంటీ బాడీలున్నట్టు నిర్ధారించారు. ముంబై, పుణె, హైదరాబాద్​ వంటి పెద్ద పెద్ద సిటీల్లోనూ పెద్ద సంఖ్యలో జనాలు కరోనా బారిన పడి ఉంటారని చెబుతున్నారు. అదే 44 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇప్పటిదాకా కేవలం 14 శాతం మందిలోనే యాంటీ బాడీలున్నట్టు తేలింది.

    *టెస్టులు పెంచినా.. కేసులు తక్కువే..
    దేశంలో ప్రస్తుతం రోజూ సగటున పది లక్షల టెస్టులు చేస్తున్నారు. అయినా.. పాజిటివ్​రేటు 2 శాతమే నమోదవుతోంది. అదే 3 నెలల కిందట దాదాపు 10 శాతం దాకా ఉండేది. అయితే.. టెస్టులు పెరిగినా చాలా వరకు కేసులు బయట పడట్లేదు. కారణం, మన దేశంలో జనాలకు ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉండడమేనని నిపుణులు చెబుతున్నారు.

    *మరణాలూ మనదగ్గర తక్కువే
    అమెరికాలో 2.7 కోట్ల మందికిపైగా కరోనా బారిన పడితే.. 4.67 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 9.39 లక్షల కేసులకే.. 2.28 లక్షల మంది చనిపోయారు. 39 లక్షల కేసులకు.. బ్రిటన్‌లో లక్షా పదివేల మంది కరోనాతో మరణించారు. ఆయా దేశాల్లో మరణాల రేటు 2 నుంచి 3 శాతం దాకా ఉంది. కానీ.. మన దేశంలో 1.4 శాతంగా ఉంది. దీనికి కారణం దేశంలో యువత ఎక్కువగా ఉండడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇటు చనిపోయిన వారిలో కూడా ఎక్కువ మంది పెద్ద వయసు వాళ్లే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు నిపుణులు.. ఏదో తెలియని ఇమ్యూన్​పవర్​కరోనా తీవ్రత పెరగకుండా కాపాడుతోందని అంటున్నారు. యాంటీబాడీలు ఎక్కువగా ఉన్న సిటీల్లో కేసులు చాలా వరకు తగ్గాయన్నారు.

    *కొత్త స్ట్రెయిన్ల పరిస్థితేంటి..?
    కేసులు తక్కువగా వస్తున్నాయి కదా అని నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు పలువురు నిపుణులు. ప్రస్తుతానికైతే పరిస్థితి మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో కొత్త స్ట్రెయిన్లు వచ్చినట్టే మన దేశంలోనూ వచ్చే అవకాశాలు ఉండొచ్చన్నారు. కాబట్టి వైరస్​లో జెనెటిక్​మ్యుటేషన్లను గుర్తించేందుకు మరిన్ని రీసెర్చ్​లు జరగాలని చెప్పారు. అయితే, ఈ కొత్త స్ట్రెయిన్లనూ ఈజీగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఇప్పటికే చాలా మందిలో యాంటీ బాడీలు ఉండడం, వ్యాక్సిన్లూ అందుబాటులోకి రావడం వంటి వాటితో ఆ స్ట్రెయిన్లనూ జయించొచ్చన్నారు.

    *ఎందుకు తగ్గినట్టు?
    లాక్​డౌన్​ఎత్తేసినా మన దగ్గర కరోనా కేసులు అంతగా పెరగకపోవడానికి కారణం.. ఇప్పటికే చాలా మంది దాని బారిన పడడమే అని ఎపిడెమియాలజిస్టులు చెబుతున్నారు. నగరాల్లో ఎక్కువ మందికి కరోనా వైరస్​సోకడం, వాళ్లలో యాంటీ బాడీలు తయారవడం.. కరోనా వ్యాప్తిని స్లో చేసిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్​లాక్​ ప్రకటించినా.. దానికి తగ్గట్టు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమూ మేలు చేసిందని చెబుతున్నారు. సాధారణం గానే ఇండియన్స్​లో ఇమ్యూనిటీ పవర్​ ఎక్కువ. ప్రస్తుత దేశ జనాభాలో యూత్​ ఎక్కువ ఉండడం కూడా వైరస్​ వ్యాప్తి తగ్గడానికి కారణమని పేర్కొంటున్నారు. మన దగ్గర కరోనా కంట్రోల్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాలో కరోనా లేట్‌‌‌‌గా ఎంటర్​ అయింది. ఆ వెంటనే లాక్‌‌‌‌డౌన్ తో వైరస్ స్పీడ్​తగ్గించాం. మన జనాభాలో యూత్‌‌​ఎక్కువ. వారిలో కరోనా వచ్చినా అసింప్టమాటిక్‌‌‌‌గానే పోయిం ది. అమెరికా, యూరప్​ దేశాల్లో పెద్ద వయసు వాళ్లు, ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ. ఆసియా కంట్రీల్లో ఇమ్యూ నిటీ ఎక్కువ. అందుకే డిసీజ్ ట్రాన్స్‌‌‌‌ మిషన్‌‌‌‌, మార్బిడిటీ తక్కువుంటుంది.

    *వ్యాక్సిన్‌లు మనవే..
    ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో మనమే ముందున్నాం. ఏ వ్యాక్సిన్‌ కావాలన్నా ముందుగా ప్రపంచం మన వైపే చూస్తోంది. ప్రపంచం మొత్తం తయారుచేసే టీకాల్లో 60 శాతం మన దగ్గర తయారవుతున్నయే. ఏటా 150 కోట్ల డోసుల టీకాలు.. 150 దేశాలకు సరఫరా అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీకరిస్తున్న వ్యాక్సిన్లలో 70 శాతం మన దగ్గర్నుంచే వెళ్తున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ల విషయంలోనూ ప్రపంచ దేశాల దృష్టి ఇండియా మీదే ఉంది. చాలా దేశాలు మన వ్యాక్సిన్ల వైపే మొగ్గుచూపుతున్నాయి. రెక్వెస్టులు సైతం పెడుతున్నాయి. ప్రస్తుతం చాలా వరకు కరోనా టీకాలు పెద్ద దేశాలకే పరిమితమయ్యాయి. పేద దేశాలకు ఇంకా అందలేదు. అయితే.. వ్యాక్సిన్ల విషయంలో ఆ లోటుపాట్లు ఉండొద్దని డబ్ల్యూహెచ్‌వో ముందు నుంచీ చెబుతూనే ఉంది. అందులో భాగంగా కొవ్యాక్స్‌ అనే గ్రూపునూ ఏర్పాటు చేసింది.

    *ఇప్పటికే 15 దేశాలకు సరఫరా
    ఇప్పటికే మన పొరుగు దేశాలు సహా 15 దేశాలకు కరోనా వ్యాక్సిన్లను ఇండియా అందించింది. ముందుగా భూటాన్‌, మాల్దీవులు, సీషెల్స్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌‌ వంటి ఆరు దేశాలకు ఫస్ట్‌ బ్యాచ్‌ టీకాలను ఫ్రీగా పంపించింది. ఆ తర్వాత మారిషస్‌, శ్రీలంకలకు ఎగుమతి చేసింది. ఆపైన బ్రెజిల్‌కు 20 లక్షల డోసులు అందించింది. దానికి కృతజ్ఞతగా ‘కరోనా సంజీవని మోసుకొస్తున్న ఆంజనేయుడి’ ఫొటోను ట్వీట్‌ చేసి ఆ దేశ ప్రెసిడెంట్‌ జెయిర్‌‌ జోసనారో కృతజ్ఞతను చాటాడు. అదే దారిలో మిడిల్‌ ఈస్ట్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలకూ వ్యాక్సిన్లను పంపించింది. రాబోయే రోజుల్లో లాటిన్‌ అమెరికా దేశాలైన మెక్సికో, అర్జెంటీనాలకు, మొరాకో, నార్త్‌ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, పశ్చిమాసియా దేశాలు, ఒమన్‌, బహ్రెయిన్‌లకూ టీకాలను అందించనుంది. ఇటు ఫిలిప్పీన్స్‌కూ మన దేశ టీకాలు అందనున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి అగ్రదేశాలూ మన దేశంతో ఒప్పందం చేసుకుంటున్నాయి.

    *మన టీకాలే ఎందుకంటే..?
    ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర టీకాలు ఎక్కువగా తయారవుతాయి. అందుకే వ్యాక్సిన్లకు క్యాపిటల్‌ అని ఇండియాను పిలుస్తుంటారు. అదే టైమ్‌లో వేరే దేశాలతో పోలిస్తే మన దగ్గర టీకా ధరలు తక్కువ. కరోనా టీకాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఫైజర్‌‌, మోడర్నా కంపెనీల టీకాల ధర చాలా ఎక్కువ. అదీకాకుండా మైనస్‌ 80 డిగ్రీల వద్ద వాటిని నిల్వ చేయాలి. వాటితో పోలిస్తే మన దగ్గర తయారైన వ్యాక్సిన్లను మామూలు ఫ్రిజ్‌ టెంపరేచర్ల వద్దే నిల్వ చేసుకోవచ్చు. ధర కూడా తక్కువే. అందుకే చాలా దేశాలు మన టీకాలపై ఆసక్తి చూపుతుంటాయి.

    -శ్రీనివాస్