https://oktelugu.com/

రామ మందిరం ఓకే.. మరి బాబ్రీ నిర్మాణం ఎలా ఉండబోతోంది..?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో హిందువుల గుంపు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం విస్ఫోటనంగా మారింది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. ఆ ఉదంతం తర్వాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. కానీ, హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 10:51 am
    Follow us on


    అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో హిందువుల గుంపు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం విస్ఫోటనంగా మారింది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. ఆ ఉదంతం తర్వాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. కానీ, హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఎట్టకేలకు అయోధ్య రామజన్మభూమి వివాదం ముగిసిపోయింది. అయోధ్య ఆ అయోధ్య రామయ్యదే అని దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పునిచ్చింది. దీంతో దేశమంతటా సంబురాలు అంబరాన్నంటాయి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ కూడా జరిగింది. స్వయంగా ప్రధాన నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 36 నుంచి 40 నెలల్లోనే ఈ మందిర నిర్మాణం పూర్తిచేయనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.

    Also Read: చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?

    అయితే.. ఇప్పుడు బాబ్రీ మసీదు నిర్మాణం విషయంలో చర్యలు ఊపందుకున్నాయి. తీర్పు సమయంలో బాబ్రీ మసీదు నిర్మాణానికి సుప్రీం కోర్టు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. సున్నీ వక్ఫ్ బోర్డు తమకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది నిర్ణయించేందుకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది.

    తీర్పు అనంతరం అయోధ్యకు సమీపంలోని ధన్నీపుర్ గ్రామంలో యూపీ ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు కోసం ఐదెకరాలు కేటాయించింది. ఈ స్థలం ఇదివరకు వ్యవసాయశాఖకు చెందిన ఫామ్ హౌస్‌లో భాగంగా ఉండేది. ప్రస్తుతం అక్కడ పొలాలు కూడా ఉన్నాయి. ఓ దర్గా కూడా ఉంది. అయోధ్యలోని రామజన్మభూమి స్థలానికి, ఇది దాదాపు 25 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అయితే, అయోధ్య కేసులోని కక్షిదారులు, అయోధ్యలోని ముస్లింలలో కొందరు ఇంత దూరంలో మసీదుకు స్థలాన్ని కేటాయించడాన్ని తప్పుపట్టారు.

    మరోవైపు ఆ స్థలంలో మసీదు నిర్మాణానికి డిజైన్‌ను రూపొందించేందుకు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఎస్ఎం అక్తర్‌ను ఆర్కిటెక్ట్‌గా ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఎంపిక చేసింది. జామియా యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ విభాగానికి అక్తర్ డీన్‌గా ఉన్నారు. ఆయనకు ఈ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఇండో ఇస్లామిక్ నిర్మాణాల డిజైన్ల రూపకల్పనలో ఆయన బాగా పేరు తెచ్చుకున్నారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌కు తాను ఎలాంటి దరఖాస్తూ చేయలేదని, తన సమర్థతతను గుర్తించే ఆ ఫౌండేషన్ తనకు ఈ అవకాశం ఇచ్చిందని అక్తర్ చెబుతున్నారు. ఐదెకరాల స్థలంలో మసీదుతోపాటు కట్టనున్న వివిధ నిర్మాణాలకు కూడా డిజైన్లు రూపొందించాలని తనకు చెప్పారని వివరించారు.

    మరి, కొత్తగా నిర్మించబోయే మసీదు మునుపటి బాబ్రీ మసీదుకు పూర్తి భిన్నంగా ఉంటుందా? ఈ ప్రశ్నకు అక్తర్ అవుననే బదులు ఇస్తున్నారు. కొత్త మసీదులో అసలు గుమ్మటమే ఉండదని అన్నారు. ఈ విషయమై సున్నీ వక్ఫ్ బోర్డు అనుమతి ఆయనకు లభించిందా అన్న ప్రశ్నకు… ‘డిజైన్ రూపొందించే ముందు అనుమతి ఎవరూ తీసుకోరు. యూరప్‌లో, ఇతర దేశాల్లో కొత్త కొత్త థీమ్‌లతో నిర్మాణాలు జరుగుతున్నాయి. పునరుత్పాదక శక్తితో పనిచేసే మసీదులు కడుతున్నారు. అన్నీ పునర్వినియోగం చేసుకునేలా రూపొందిస్తున్నారు’ అని అక్తర్ అంటున్నారు. ప్రస్తుతానికి మసీదు రూపం ఎలా ఉండాలనేదాని గురించి తాను ఇంకా ఆలోచించడం మొదలుపెట్టలేదని ఆయన అన్నారు.

    Also Read: పబ్ జీకి పోటీగా భారతీయ ‘ఫౌ-జీ’

    ఐదెకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే మసీదు ఉండబోతోందని అక్తర్ చెప్పారు. కాంప్లెక్స్‌ను ‘ఖిద్మత్ ఏ ఖల్క్’ అనే థీమ్‌తో రూపొందిస్తున్నారు. దీని అర్థం మానవ సేవ. ఈ కాంప్లెక్స్ ఇస్లాంను, భారతీయతను ప్రతిబింబించేలా ఉంటుందట. కాంప్లెక్స్‌లో ఆసుపత్రితోపాటు విద్యా సంస్థ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఆ విద్యా సంస్థ సాధారణ పాఠశాల కాకపోవచ్చని, చరిత్రను బోధించడం ద్వారా జనాలకు విజ్ఞానం అందించే సంస్థై ఉండొచ్చట.  మసీదు ప్లాన్ ఎప్పటిలోగా రూపొందుతుందన్న ప్రశ్నకు అక్తర్ జవాబు ఇవ్వలేదు. మసీదుకు ఏ పేరు పెడుతారు?, నిర్మాణం మొదలుపెట్టే కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానిస్తారు? అన్న వివరాలు కూడా చెప్పలేదు. ఈ మసీదు డిజైన్ రూపొందించే బాధ్యతను తనకు అప్పగించడం చాలా పెద్ద విషయమని, దీని పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని అక్తర్ అన్నారు.