ఉత్తరాఖండ్ లో మరోమారు జలప్రళయం సంభవించింది. చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడడంతో గంగా ఉపనది అయిన ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీని ప్రభావంతో రేని తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకుపోయింది. మరో మూడు వంతెనలు కూడా దెబ్బతిన్నాయి.
ఈ ఘటనలో పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్టు ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారంతా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 10 మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు.
చమోలీ జిల్లాలోని జోషిమఠ్ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ధౌలీ గంగానది నీటి ప్రవాహం పెరిగింది. వరద ధాటికి తపోవన్-రేనీ ప్రాంతంలో ఉన్న రుషిగంగా పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా దెబ్బతింది.
నీటి ప్రవాహం ధాటికి ప్రాజెక్ట్ సహా పలు ఇళ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఉత్తరఖండ్ ప్రభుత్వం పరిసర గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నది వెంట హైఅలెర్ట్ ప్రకటించింది.
150మంది గల్లంతు.. వరదలపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తామని.. కేంద్రం తరుపున అండగా ఉంటామని తెలిపారు.