
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఫలితం నేడు వెలువడింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన హోరాహోరీ పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,118 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందాడు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.
తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి ఉప ఎన్నికల్లో తనకు ఎదురులేదని నిరూపించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలువడంతో హుజూర్ నగర్లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకొని ఉప ఎన్నికల్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.
తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందనే టాక్ విన్పించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తుండటంతో సానుభూతి ఓట్లు కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావించారు. అదేవిధంగా దుబ్బాక ఎన్నికల ఇన్ ఛార్జిగా హరీష్ రావు బాధ్యతలు చేపట్టడంతో దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడక అనే భావన శ్రేణుల్లో వ్యక్తమైంది. హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ నేతలను తమ పార్టీలోని చేర్చుకొని ఆ పార్టీలకు గట్టి సవాల్ విసిరారు.
అయితే ఎన్నికల రిజల్ట్ చూస్తుంటే టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆపార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామలింగారెడ్డిపై సానుభూతి ఓట్లరూపంలో తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు భావించగా ఈ ఎన్నికలో ఆ ప్రభావం పెద్దగా కన్పించలేదు. దుబ్బాక ఎన్నికను హరీష్ రావు ఒక్కడే భుజస్కంధాలపై మోయగా మిగతా నాయకులు ఎక్కడా కూడా కన్పించకపోవడం కూడా ఆ పార్టీని దెబ్బతీసినట్లు కన్పిస్తోంది.
మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు శక్తి సామర్థ్యాలను.. యువతలో ఆయనకు ఉన్న పట్టును టీఆర్ఎస్ నేతలు గుర్తించలేదని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో డబ్బుల కట్టల ఘటనను స్థానిక ఓటర్లు పెద్దగా నమ్మలేదని ఓట్ల ఫలితాలు చూస్తుంటే అర్థమవుతోంది. అలాగే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలుస్తోంది. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ఓటమికి బలంగా పని చేసినట్లు కన్పిస్తోంది. ఏదిఏమైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణలో టీఆర్ఎస్ హవాకు గండికొట్టినట్లు కన్పిస్తోంది.