
రెడ్ స్టార్ గా పేరొందిన మాదాల రంగారావు చివరి దశలో ఏ ఆదరణ లేకుండా చనిపోయారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ పట్టించుకోలేదన్న టాక్ ఉంది.
ఒకప్పుడు విప్లవ చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సామాజిక చిత్రాలు తీసి స్టార్ హీరోగా ఒకనొక సమయంలో వెలుగొందారు మాదాల రంగారావు గారు. ఆర్. నారాయణమూర్తి వలే ఈయనది విప్లవ పంథానే.. అప్పట్లో రంగారావు సినిమాలంటే జనం చెవికోసుకునే వారు. ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మరథం దక్కేది. ప్రతి సినిమాలో సామాజిక అంశాలను లేవనెత్తి ఎన్నో 200 రోజుల చిత్రాలు తీశారు.
ఒంగోలు జిల్లాలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. కమ్యునిస్టు భావాలతో మమేకమైన కుటుంబం నుంచి వచ్చిన మాదాల.. ప్రజానాజ్య మండలితోనూ ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆ అనుబంధంతోనే ఆయనకు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. ఆరంభంలో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసి.. విలన్ పాత్రలు కూడా చేశారు. తర్వాత ‘నవతరం పిక్చర్స్ పతాకంపై ’ పలు విప్లవ చిత్రాలు నిర్మించి, నటించారు. ఎన్నో హిట్స్ చిత్రాలు అప్పుడే సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి సహా నవతరం హీరోలకు షాక్ ఇచ్చారు.
అంత గొప్ప నటుడు చనిపోతే కనీసం టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కనీసం సంతాపం తెలిపిన పాపాన పోలేదు. ఒక్కరు కూడా నివాళులర్పించలేదు. సినీ ప్రముఖులు చనిపోతే ఫిలింనగర్ లోని మా అసోసియేషన్ భవనంలో ఉంచడం ఆనవాయితీ.. ఈయన మృతిచెందినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో అనాథ శవంలా పాపం ఆయన ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటి జనాలకు తెలియని ఈ స్టార్ హీరోను టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టించుకోకపోవడంపై సినీ అభిమానులు మండిపడ్డారు.. మాదాలతో అప్పట్లో సినిమాలు చేసిన అగ్రహీరోలు సైతం ఆయన మృతిపై స్పందించకపోవడం శోచనీయమంటున్నారు.