
తెలుగు సినిమాకి స్వచ్ఛమైన హాస్యాన్ని అద్దిన ఘనత ఒక్క ‘జంధ్యాల’కే దక్కుతుంది. ఇప్పటి జనరేషన్ కి ‘జంధ్యాల’ అంటే, ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఆయన సినిమాలు భవిష్యత్తు తరాల వారు కూడా హాయిగా చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు. అయితే, అంత గొప్ప కామెడీ చిత్రాలు తీసిన జంధ్యాల, సెట్ లో మాత్రం చాల సీరియస్ గా ఉండేవారు. జంధ్యాలకి వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం అలవాటు. అలాగే తెల్ల టోపీ, భుజాన తెల్ల టవల్ కూడా వేసుకొవడం ఆయనకు సెంటిమెంట్.
అసలు జంధ్యాల సంవత్సరానికి పది సినిమాలకు కథలు మాటలు రాస్తూనే, ఆయన అంత గొప్ప హాస్య చిత్రాలను ఎలా డైరెక్ట్ చేయగలిగారు అని, ఇప్పటి కుర్ర డైరెక్టర్లు కూడా షాక్ అవుతూ ఉంటారు. నిజానికి జంధ్యాల వర్కింగ్ స్టైల్ చాల విభిన్నంగా ఉండేది. ఆయన అర్ధరాత్రి దాకా మెలకువతో ఉండేవారు. రాత్రులు ఎక్కువగా డైరెక్షన్ కి సంబంధించిన షాట్స్ పై ఫోకస్ పెట్టేవారు.
అయితే, రాత్రి అంతా నిద్ర పోకపోయినా, జంధ్యాల మాత్రం తెల్లవారుజామున 5.30కి లేచేవారు. ఇంటి వరండాలో పట్టెమంచం మీద కూర్చుని సూర్యోదయం వేళ రాసుకోవడం ఆయనకు బాగా ఇష్టం. అందుకే, ఆయన ఎప్పుడూ ఆ విధంగానే రాస్తూ ఉండేవారు. పైగా ఆయనకు ఆయనే ఒక కండీషన్ కూడా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కనీసం రోజుకు రెండు సీన్లు అయినా రాయాలి అనేది ఆ షరతు ఉద్దేశ్యం.
అందుకే ఆయన కచ్చితంగా రెండు సీన్లు రాయకుండా ఉండే వారు కాదు. అలా అర్ధరాత్రి వరకు ఎలా డైరెక్షన్ చేయాలి అని షాట్స్ ప్లాన్ చేసుకుంటూనే.. ఉదయానే లేచి స్క్రిప్ట్ రాసుకునేవారు. పగలు సినిమాలను డైరెక్ట్ చేసేవారు. బహుశా ఆయన అంత విపరీత ధోరణిలో పని చేయడం వల్లే కాబోలు, ఆయన ఆరోగ్యం దెబ్బ తింది. దీనికి తోడు ఆయన ఎక్కువగానే మద్యం సేవించేవారు. అది కూడా ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసింది.
తనకున్న మద్యం అలవాటే, తన ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసిందని జంధ్యాలగారు కూడా ఎప్పుడూ అనేవారు. అవి జంధ్యాలగారి చివరి రోజులు. అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్న రోజులు అవి. అలా జంధ్యాలగారిని చూడలేక రామానాయుడుగారు బాధపడుతూ ‘ఏంటిది జంధ్యాల..’ అని నిట్టూరుస్తూ అడిగారు. ఆ మాటకు జంధ్యాల చిరు నవ్వి ‘ఏముందండీ. ఆనందించానుగా, ఇప్పుడు అనుభవిస్తున్నాను’ అని నర్మగర్భంగా నవ్వుతూ అన్నారట. బాధలో కూడా నవ్వించడం ఒక్క జంధ్యాలకే సాధ్యం అయింది.