
మొదటి వేవ్ ను తట్టుకున్నాం..రెండో వేవ్ కు బలయ్యాం.. కానీ ఇప్పుడు థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. ప్రాణాలు తీసేందుకు వడివడిగా రంకెలేస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ లో దేశంలో మరణ మృదంగం వినిపించింది. లక్షల మంది ప్రాణాలు తీసింది. శవాలను కాల్చలేనంతగా శ్మశానాల ముందు క్యూలు కనిపించాయి. అయితే సెకండ్ వేవ్ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు మరో ముప్పు పొంచి ఉంది.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అయితే వైరస్ రూపాంతరం చెంది డెల్టా ప్లాస్ గా మారిందని.. థర్డ్ వేవ్ కోరలు చాచడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులకు డెల్టా వేరియంట్ కరోనానే కారణం. ఇప్పుడు అది డెల్టా ప్లస్ వేరియంట్ గా రూపాంతరం చెందిందని సమాచారం. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్త రకం ప్రభావాన్ని అంచనావేసే పనిలో పడ్డారు. అయితే ఇది ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పాకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అప్రమత్తమైన కేంద్రం దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్ ’గా పేర్కొంది. దాని తీవ్రతను బట్టి ఆందోళనకర వేరియంట్ గా వర్గీకరిస్తామని తెలిపింది.
కాగా ఇప్పటికే ఈ ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ లో విస్తరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ బాంబుపేల్చింది.
ఈ కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ తో మహారాష్ట్రలో మూడో ముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనావేసింది. మరోపక్క కేరళలో మూడు కేసులు.. మధ్యప్రదేశ్ లో ఒక కేసు బయటపడినట్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
థర్డ్ వేవ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కేసులు బయటపడుతుండడంతో మళ్లీ దేశంలో కేసులు, లాక్ డౌన్ తప్పదా? ఈసారి ఎంత మంది ప్రాణాలు పోతాయోనన్న భయం వెంటాడుతోంది.