
ఇన్నాళ్లు ఉగ్గబట్టుకొని ఉన్న ఏపీ సీఎం జగన్ ఇప్పుడు బయటపడ్డారు. కేంద్రం తన అసహాయతను అవకాశంగా మలుచుకుంటుందని సీఎం జగన్ కు అర్థమై ఉంటుంది. ఇన్నాళ్లు బతిమాలాడాడు.. బామాలాడు.. కానీ ఇప్పుడు కేంద్రం తీరుపై ఓపెన్ అయ్యాడు. కాస్త గట్టిగానే ఏపీ అన్యాయంపై ప్రశ్నించాడు. కేంద్రంతో సయోధ్యతో ముందుకెళుతున్న జగన్ కు వరాల మూట విప్పని.. కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని తీరుపై జగన్ తన అసంతృప్తిని బహిరంగంగా బయటపెట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: పోలవరం వ్యయం పెరుగుదల పాపం టీడీపీదేనా?
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ని అర్జీలు పెట్టినా.. నివేదికలు పంపినా.. రూపాయి విదిల్చని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి గుండె కాయ అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నిధుల విషయంలో కొర్రీలు వేయడంపై జగన్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పోలవరం ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు అని.. ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని కుండబద్దలు కొట్టారు.
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని నాడు విభజన చట్టంలో పేర్కొన్నారని.. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు.. ఇక ముసుగులో గుద్దులాటకు స్వస్తి పలికారు. నాటి కేంద్రమంత్రివర్గం కూడా దీనిపై నిర్ణయం తీసుకుందని జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును కేవలం పర్యవేక్షించడం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. ఇప్పటివరకు పోలవరంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4014 కోట్లను తిరిగి చెల్లించాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఈ ఈ మొత్తంలో రూ .2,234 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, జల్ శక్తి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని జగన్ వివరించారు.భూసేకరణ – పునరావాసం కోసం సుమారు రూ.29,000 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. దీనిని సిడబ్ల్యుసి.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని జగన్ చెప్పారు.
Also Read: జగన్ సర్కార్ కు మోదీ శుభవార్త.. కడప జిల్లాలో..?
అంతకంటే ముందుగా జాతీయ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని.. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్ డిమాండ్ చేయడం విశేషం. సిడబ్ల్యుసి -కేంద్ర జలశక్తి శాఖ సిఫారసు చేసినట్లు, అమలు చేసిన నాడు ఉన్న రేట్లు, నియమాలు.. నిబంధనలు సడలించి ఇప్పటి రేట్ల ప్రకారం చెల్లింపు కోసం భూసేకరణ.. పునరావాస పనులను పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సిడబ్ల్యుసి ఆమోదించిన ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని 2017-18 ధరల స్థాయిలో 55,448 కోట్ల రూపాయలకు ఆమోదించింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సిసి) ఖర్చును సవరించింది.. ఈ ప్రాజెక్టును రూ .47,726 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయబడింది.
కానీ రెండేళ్ల క్రితం రేట్లతో ప్రాజెక్టును పూర్తి చేయలేమని.. సవరించిన వ్యయ అంచనాను పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు పూర్తిచేయాలని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ పోలవరం ప్రాజెక్ట్ అని.. ఇప్పటి ఖర్చుల ప్రకారం ప్రాజెక్ట్ అంచనవ్యయాలను సవరించి పూర్తి చేయాలని సీఎం జగన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.