
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరుపున సోము వీర్రాజు హవా కొనసాగుతోంది. అంతకుముందు బీజేపీ నాయకులు కనీసం ప్రెస్‌మీట్లో కూడా కనిపించేవారు కారు. కానీ సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ సందర్భంగా బీజేపీలో గతంలో అనేక పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు. గతంలో వెంకయ్య వర్గం అని చెప్పుకునే వారు ఇప్పుడు బీజేపీలో లేరా..? అన్న చర్చ సాగుతోంది.
ఏపీ బీజేపీలో గతంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కుంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజులు పార్టీలో యాక్టివ్‌గా ఉండేవారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయన కనునస్నల్లో నడుచుకునేవారన్న చర్చ నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఒకరిద్దరు అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లలో కనిపించేవారు. కానీ సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత వీరిలో ఎవరూ కనిపించడం లేదు.
జగన్ సర్కారు ఏర్పడినప్పుడు గోకరాజు గంగరాజు తన కుమారుడు రామరాజు, తమ్ముడు నరసింహరాజులను వైసీపీలోకి పంపించారు. అయితే వారు పార్టీలో చేరడంపై తనకేమీ సంబంధం లేదన్నట్లు మిన్నకున్నారు. మోన్నామధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టులో కేసు వేసి సర్కారును ఇబ్బంది పెట్టారు. కుంభంపాటి అసలుకే కనిపించడం లేదు. ఏలూరి సాంబశివరావు అనరారోగ్యాలతో బాధపడుతున్నానని చెబుతున్నా వైసీపీలో రాజ్యసభ సీటు కోసం యత్నిస్తున్నారు.
కాగా సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత టీడీపీకి అనుకూలంగా ఉన్నవారిని బీజేపీ నుంచి ఏరివేశారు. టీడీపీకి వంత పాడుతున్న సుజనాచౌదరి లాంటి వారి నోటికి తాళంవేశారు. ఇక వైసీపీకి అనుకూలంగా రాజకీయం చేసేవారికి సైతం చెక్ పెట్టారు. ఏపీ బీజేపీని సెట్ రైట్ చేశారు. అందుకే అవసరార్థం బీజేపీలో చేరిన వారు ఇప్పుడు సోము వీర్రాజు దూకుడు ముందు అంతా మౌనం దాల్చి సైడ్ అయిపోయారని.. బీజేపీ తరుఫున ఫైట్ చేసే వారే వెలుగులో ఉన్నారన్న గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి..