
ఈ మధ్య కాలంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా క్రెడిట్ కార్డుల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మొదట తీసుకున్నా క్రెడిట్ కార్డుల వల్ల తర్వాత కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి.
లోన్ ఫెసిలిటీ, నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, రివార్డ్ పాయింట్లు లాంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆఫర్లను చూసే చాలామంది క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సరైన అవగాహన లేకుండా క్రెడిట్ కార్డును తీసుకుంటే ఇబ్బందులు పడక తప్పదు.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డ్ తీసుకునే ముందు ఛార్జీల గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. చాలా బ్యాంకులు వేర్వేరు పేర్లతో ఛార్జీలను వసూలు చేస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. డ్యూ డేట్ లోపు డబ్బు చెల్లించని వినియోగదారులు భారీ మొత్తంలో ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులకు మెయింటెనెన్స్ ఫీజులు కూడా ఉంటాయి. 12 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డును వినియోగించి ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్నా కూడా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుబ్యాంకును బట్టి క్రెడిట్ కార్డుల నిబంధనల్లో అనేక మార్పులు ఉంటాయి. బ్యాంకులు ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసినా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో క్రెడిట్ కార్డును వాడినా ఛార్జీలు చెల్లించాలి. అందువల్ల సరైన అవగాహన లేకపోతే క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం మంచిది.