ఒక ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే.. దాని కింద వ్యవస్థ కూడా అదే స్థాయిలో పనిచేయాలి. అందుకే ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని త్వరలో చేంజ్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. తదుపరి చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసుకున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
Also Read: జగన్ లేఖపై ఎవరూ మాట్లాడొద్దు.. వైసీపీ కఠిన ఆదేశం?
కాబోయే చీఫ్ సెక్రటరీని ఆ పోస్టు కంటే ముందు అత్యంత కీలకమైన సీసీఎల్‌ఏ కమిషనర్‌గా నియమిస్తుంటారు. తదుపరి సీఎస్‌గా ఆయనకే బాధ్యతలు ఇస్తారు. అయితే.. నిన్నటి వరకు సీసీఎల్‌ఏగా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. తదుపరి సీఎస్ ఆయనే అవుతారని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా రాత్రికిరాత్రే నీరబ్ కుమార్ ప్రసాద్‌ను బదిలీ చేశారు. అన్ని శాఖల నుంచి రిలీవ్ చేసేశారు. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అంతేకాదు ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
నీరబ్ కుమార్ ప్రసాద్‌కు సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుంది. అందుకే.. ఆయనకు వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం దర్యాప్తు బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయన క్షణ్ణంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. అయితే.. అది ప్రభుత్వ పెద్దలు అప్పటి వరకూ చెబుతూ వస్తున్న.. చేస్తున్న చేతలకు కాస్త భిన్నంగా ఉంది. దీంతో అప్పటి నుండే ఆయనపై అసంతృప్తి ప్రారంభమైందన్న చర్చ అధికారవర్గాల్లో ఉంది. సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. కరోనా కారణంగా రెండు విడుతలగా ఆమె పదవీ కాలాన్ని పొడగించారు. ఇప్పుడు నిబంధనల ప్రకారం మళ్లీ పొడగించే అవకాశాలు లేవు. ఏపీ సర్కార్ నుంచి అలాంటి ప్రతిపాదన కూడా కేంద్రం వైపు వెళ్లలేదు.
జగన్ తండ్రి వైఎస్ రాజేశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ కీలక పోస్టులో ఉన్నారు. భారీ నీటి పారుదల శాఖలో ఆయన హవా ఉండేది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే.. ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఆదిత్యనాథ్ దాస్‌కు అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నందున కోర్టు ఖర్చుల కోసం అప్పటి ప్రభుత్వం రూ.7.56 లక్షలు ఇచ్చింది. నిబంధనల ప్రకారం న్యాయవాదుల నుంచి రసీదులు తీసుకుని ప్రభుత్వానికి ఆ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కానీ చెప్పలేదు. దీనిపైనా ఆయనపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Also Read: జగన్ దర్శనం కోసం ఆ ‘పూజారి’ ఆశీర్వాదం తప్పనిసరి..!
జగన్మోహన్ రెడ్డి పాటు కేసుల్లో ఇరుక్కున్న వారికి పెద్ద ఎత్తున పదవులు లభిస్తున్నాయన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో సాగుతోంది.అధికారుల్లోనూ వారికే ప్రాధాన్యం లభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు సీఎస్ నియామకంలోనూ అదే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘ఏ రాజు అయినా తనకు అనుకూలంగా ఉన్న భటులనే పెట్టుకోవాలని చూస్తారు తప్ప.. ఇబ్బంది పెట్టే వారిని కాదు కదా’. ఇప్పుడు జగన్ చేస్తుంది కూడా అదేనని స్పష్టంగా అర్థమవుతోంది.