
ఏపీ దశాబ్ధ కల తీరిపోయింది. పోలవరం ప్రాజెక్టు నుంచి తొలి ఫలితం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం రాబోతుంది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదల కార్యక్రమానికి శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేయనున్నారు.
గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేయడం ద్వారా ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతోపాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సశ్యశ్యామలం చేయనుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తరువాత స్పిల్ వే.. రివర్ స్లూయిజ్.. పవర్ హౌస్ డిశ్చార్జ్ ల ద్వారా బ్యారేజ్ ల నుంచి కాలువలకు చేరుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది.
పోలవరం నిర్మాణంలో స్పిల్ వే తో పాటు మూడు గ్యాపులు (ఈసిఆర్ఎఫ్ 1,2,3) తో పాటు జల విద్యుత్ కేంద్రం, జల రవాణా పనులు కీలకమైనవి. ఇందులో ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసింది. గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. దీంతో ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు.
గోదారవి నది నీటిని 6.6కిలోమీటర్ల మేరకు మళ్లించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన. దేశంలోనే రెండో పెద్ద నది అయినటువంటి గోదావరిపై ఇలాంటా ప్రయత్నం చేయడం సాహసమే. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడివైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మళ్లిస్తారు. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగుతుంది.