ఏపీలో ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి 1 తేదీనుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టబోతోంది. చిన్నారులకు అమ్మ ఒడి.. నాడు నేడు.. వృద్ధులకు వైఎస్ఆర్ పెన్షన్లు, కుల వృత్తుల వారికి పనిముట్లు.. ఆటో, ఇతర వాహనదారులకు పారితోషికాలు ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజలు నాణ్యమైన ఆహారం తీసుకోవాలని.. ఇంటి వద్దనే అందుకు సంబంధించిన సరుకులు తీసుకోవాలనే సంకల్పంతో ప్రవేశ పెట్టిన ‘ఇంటింటికి రేషన్ బియ్యం పథకం’ సోమవారం నుంచి రాష్ర్టవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇప్పుడు హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పథకం అమలు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది.
ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పేరుతో నిత్యవసర సరుకులు అందించేందుకు రాష్ర్ట సర్కారు సిద్ధం అయ్యింది. రేషన్ బియ్యంతో పాటు మూడు రకాల సరుకులు ఇందులో పంపిణీ చేయనున్నారు. ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనమే నేరుగా ఇంటి ముందుకు వచ్చి సరుకులు అందిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరకుండా ఇంటివద్దనే ఉండి సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే విధంగా ఒక్క పథకంలో రెండు విధాల లబ్ధి చేకూరేలా వైఎస్. జగన్ ఆలోచన చేశారు. ఓవైపు రాష్ట్రంలోని పేదలకు ఇంటింటికీ నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూనే.. మరో వైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నారు.
ఇంటింటికీ రేషన్ పథకం నిజానికి గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలు రాష్ట్రానికి రావడం కొంత ఆలస్యమైంది. జనవరిలో రేషన్ పంపిణీ వాహనాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. పదిరోజుల క్రితం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ పథకంలో ఇంటింటికీ సన్నబియ్యంతోపాటు మూడు సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రస్తుతం పట్టణాల్లో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. రేషన్ సరుకుల పంపిణీ వాహనాలపై వైఎస్ జగన్ చిత్రం ఉందనే అక్కసుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గ్రామాల్లో రేషన్ పంపిణీ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి అయితే పట్టణాల్లో మాత్రమే పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రేషన్ డోర్ డెలివరీ పథకం ద్వారా ఇటు లబ్ధిదారులకే కాదు నిరుద్యోగ యువతకు కూడా జగన్ సర్కారు ఉపాధిని ఇస్తోంది. రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనదారులకు నెలకు రూ.10వేల వేతనం ఇవ్వనున్నారు. అదే విధంగా ఒక వలంటీరును నియమించి సరుకులు పంపిణీ చేయనున్నారు. సన్నబియ్యంతో కూడిన సరుకులు పంపిణీ చేస్తుండడం ఆనందంగా ఉందని ఏపీ ప్రజలు అంటున్నారు.