
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి.. ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ తాజాగా కశ్మీర్ పై మరో తేనెతుట్టును కదిపింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్ పై కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారగా.. తాజాగా రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై అమిత్ షా స్పందించారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
గత 70 ఏళ్లుగా రావణకాష్టంగా రగిలిన కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ చేయలేని పరిష్కారాన్ని బీజేపీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా అన్నారు. హింస, అంశాంతితో కూడిన పాత రోజులు కశ్మీర్ లో మళ్లీ రావన్నారు.
కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో అధికార పంపిణీ జరుగుతోందని అమిత్ షా అన్నారు. పంచాయతీలకు పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించినట్టు తెలిపారు. కశ్మీర్ పంచాయతీ ఎన్నికల్లో 51శాతానికి పైగా పోలింగ్ జరగడాన్ని అమిత్ షా కొనియాడారు. ఇక కశ్మీర్ వ్యాలీకి 2022 కల్లా రైలు మార్గం ఏర్పాటు చేస్తామని.. 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
దీన్ని బట్టి కేంద్రం కశ్మీర్ విషయంలో పకడ్బందీ ప్లానింగ్ తోనే వెళుతోందని అర్థమవుతోంది. రాష్ట్ర హోదా ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదని తెలుస్తోంది.