
మన దేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల యొక్క సంక్షేమ ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డే ఇప్పుడు ఆధారమైందని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మన ఆధార్ కార్డును ఇతరులు వాడే అవకాశం ఉంది. ఇతరులు మన ఆధార్ కార్డును వాడటం వల్ల మన ఆధార్ కార్డ్ దుర్వినియోగం అవుతుంది.
అయితే మన ఆధార్ కార్డును ఇతరులు వాడితే మాత్రం సులభంగా కనిపెట్టవచ్చు. గడిచిన ఆరు నెలల్లో ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో సులువుగా తెలుసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే ఆధార్ కార్డును ఇతరులు వినియోగిస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ ఈ కొత్త సదుపాయాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.
ఆధార్ కార్డును గడిచిన ఆరు నెలల్లో ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవాలంటే మొదట ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పేజ్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయడంతో పాటు సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం వన్ టైమ్ పాస్ వర్డ్ పై క్లిక్ చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఎన్ని లావాదేవీలు చూడాలనుకుంటున్నారో, ఎంత వ్యవధిలో చూడాలనుకుంటున్నారో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ తరువాత ఎక్కడ లావాదేవీలు జరిపామో తేదీ , సమయం, ఆధార్ కార్డు అథెంటికేషన్ వివరాలను స్క్రీన్ పై తెలుసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మన ఆధార్ కార్డును ఎప్పుడు, ఎక్కడ వినియోగించారనే సంగతి తెలుస్తుంది. ఆ లావాదేవీలలో మన ఆధార్ కార్డును ఎవరైనా మిస్ యూజ్ చేసి ఉంటే ఆ వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.