Homeజాతీయ వార్తలుసాగర్ లోనూ ‘తీన్మార్’ మోగించడమేనా?

సాగర్ లోనూ ‘తీన్మార్’ మోగించడమేనా?

Nagarjuna Sagar By-Poll
రక్తం రుచి మరిగిన పులి తన ఆకలిని తీర్చుకునేదాక వదిలిపెట్టదు. గాయపడిన సింహం అందుకు కారణమైన వారిపై పంజా విసరక మానదు. ఓటమి చవిచూసిన వ్యక్తి దాన్ని గెలుపుతీరాలకు చేర్చేంతవరకు ప్రయత్నం సాగిస్తూనే ఉంటాడు. అవకాశం దొరికిందా… అంతే సంగతి ఇక… ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒకనాడు ఏ ఎదురించే గొంతునుంచి ఉద్యమం పుట్టుకొచ్చిందో.. ఎవరి మాటలకు తెలంగాణ ప్రజలు పోరాట పటిమను పెంచుకున్నారో.. ప్రస్తుతం మళ్లీ అలాంటి సీనే కనిపిస్తోంది. ప్రజా హక్కులను అణగదొక్కేయాలని చూస్తున్న వారికి గుణపాఠం చెప్పాలని నాడు ఉద్యమం ప్రారంభించిన వ్యక్తే.. ఆ బాటలో పయనిస్తున్నాడని మరో సామాన్య వ్యక్తి… ఉద్యమకారుడిగా అవతారం ఎత్తాడు ఇప్పుడు.

తీన్మార్ మల్లన్న.. ఊరాఫ్ చింతపండు నవీన్ కుమార్.. ఇప్పుడు ఈ పేరు ఎంతో ఫేమస్. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చి తెలంగాణలోనే అతిపెద్ద గులాబీ పార్టీకే ముచ్చెమటలు పుట్టించాడు. మొన్నటి నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మల్సీ ఎన్నికల సందర్భంగా.. బరిలో నిలిచిన చింతపండు నవీన్ కుమార్ వీడేం చేస్తాడులే బచ్చాగాడు అనుకున్న వారికి తొలివేసవిలోనే చెక్కరొచ్చేలా చేశాడు. మహామహులను, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రోఫెసర్లను సైతం వెనక్కి నెట్టేసి.. గెలుపు బావుట వైపు పరుగులు తీశాడు. ఒకదశలో విజయం సాధించేలా కనిపించాడు. తరువాత ప్రధాన్యత ఓట్ల ఆధారంగా ఓడినా ప్రజల మనసులో విజయం సొంతం చేసుకున్నాడు.

తీన్మార్ మల్లన్న 2015లోనూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ ఓటమిలో కారణాలు వెతికాడు. తాను ప్రజల్లోకి వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేసుకున్నాడు. యూట్యూబ్ చానల్ వేదికగా తన ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కేసీర్ కుటుంబ పాలనే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించాడు. తన ఘాటైన మాటలతో యువతకు దగ్గరయ్యాడు. యూట్యూబులో ప్రేక్షకాదరణను పెంచుకున్నాడు. మీడియా పరంగానే కాకుండా ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని అనుకున్నాడు. ఇంతలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ అంటూ సమాచారం వచ్చింది.

తన సైన్యంతో సరైన వ్యూహంతో రంగంలోకి దిగాడు. మొదట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించాడు. దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదురైనా.. ధీటుగా సమాధానం ఇస్తూ.. ముందుకు సాగాడు.. పోటీలో నిలిచాడు. కౌంటింగ్ సమయంలో అనూహ్యంగా వార్తల్లో నిలిచాడు. ఆర్థిక బలం.. అంగబలం ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డికే చుక్కలు చూపించాడు. ఒకదశలో గెలుస్తాడా అన్న భయాన్ని టీఆర్ఎస్ నేతల్లో నెలకొలిపాడు. దురదృష్టం కొద్ది రెండోస్థానంలో సరిపెట్టుకున్నా.. ప్రజల మనసులో తాను విజయం సాధించానని ధీమాతో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నాడో.. అక్కడే వెతుక్కునే పనిలో పడ్డాడు తీన్మార్ మల్లన్న. నాగార్జున సాగర్ నోటిఫికేషన్ విడుదలైంది. బలమైన అభ్యర్థికోసం బీజేపీ వెతుకుతోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యాడు. దీంతో అందరూ బీజేపీ పెద్దలతో చర్చలకే తీన్మార్ మల్లన్న ఢిల్లీ వెళ్లాడని అనుకుంటున్నారు. ఆయన మాత్రం ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లు మంగళవారం ప్రారంభం అయ్యాయి. అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి పార్టీలలో ఏర్పడింది. ఊపుమీద ఉన్న బీజేపీకి బలమైన అభ్యర్థి ఇంకా సాగర్ లో దొరకలేదు. ఉన్నవారు కూడా అంతటి సమర్థలు కారని హై కమాండ్ డిసైడయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఎవరికీ టికెట్ ఇవ్వాలని అనుకోవడం లేదు. కొత్తవారికోసం కమల అధిష్టానం వెతుకుతోంది. టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో.. టికెట్ ఖరారైన తరువాత ఎవరైనా బీజేపీ వైపు రాకపోతారా..? అన్న ఆశతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిన్నప్పరెడ్డి, కోటిరెడ్డి సాగర్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.

అయితే సాగర్ టికెట్ ను యాదవ సామాజిక వర్గానికి అదికూడా.. నోముల తనయుడికే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరగడంతో.. మిగిలిన ఆశావహులతో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. రెండోస్థానం సాధించిన తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో క్రేజ్ కావడం, యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయన వైపు కూడా దృష్టి పెడుతున్నారు. అయితే టీఆర్ఎస్ ఖరారు చేసిన తరువాతే.. అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది. మొత్తంగా బీజేపీకి సొంతపార్టీ అభ్యర్థులపై నమ్మకం లేకుండా పోయింది. దీంతో బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు అవుతారా..? టీఆర్ఎస్ ను చాలెంజ్ చేసిన తీన్మార్ మల్లన్న అవుతారా..? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే మల్లన్న మాత్రం సొంత పార్టీ ఆలోచనలో ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి సాగరమధనంలో.. తీన్మార్ పోరు..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular