
Nikhat Zareen: ఎక్కడో నిజామాబాద్ జిల్లా.. పేద కుటుంబం.. తినడానికే ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లలేని దుస్థితి.. ఇలాంటి కుటుంబంలో పుట్టిన ఆ యువతి బంగారు కలలు కన్నది. తనది పేదరికం అయినప్పటికీ ఆ తండ్రి ఆ అమ్మాయి కలలకు పదును పెట్టాడు. వాటిని సాకారం అయ్యేదాకా అతడు నిద్రపోలేదు. ఆమెను నిద్రపోనివ్వలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, మరెన్నో అవమానాలు.. ఇన్నింటి మధ్య రాటు తేలింది. శివంగి లా ఎదిగింది. మగ వాళ్లకు మాత్రమే పరిమితం అనుకునే బాక్సింగ్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. అంతేకాదు వరుసగా స్వర్ణ పతకాలు గెలిచి.. బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సరసన నిలిచింది. ఆ అమ్మాయి పేరే నిఖత్ జరీన్. 2007లో నిజామాబాద్ కలెక్టరేట్ క్రీడా ప్రాంగణంలో ఓనమాలు నేర్చుకున్న నిఖత్.. ఆ తర్వాత తన పంచ్ కు పదును పెట్టేందుకు తన కుటుంబాన్ని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు మార్చింది. ఇక్కడ కోచ్ చిరంజీవి దగ్గర శిష్యరికం చేసింది. ఆ తర్వాత విశాఖపట్నంలోని సాయ్ సెంటర్లో తీసుకునే అవకాశం లభించింది.. అప్పటికే జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన నిఖత్.. విశాఖ తీరం చేరిన తర్వాత జూనియర్ వరల్డ్ ఛాంపియన్ గా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది.
ఇప్పుడు ఈ విజయంతో నిఖత్ అంటే ఎవరని ప్రశ్నలు ఉదయించిన చోటే.. చాంపియన్ అంటూ దేశం జేజేలు పలుకుతున్నది. “నువ్వు ప్రపంచ ఛాంపియన్ వా” అని నొసలు చిట్లించిన వారికి.. “నేను రెండోసారీ కూడా విశ్వవిజేతను” అంటూ బదులిచ్చింది. అమ్మాయిలకు ఈ ఆట అవసరమా అనే అవరోధాన్ని దాటుకుని దేశ బాక్సింగ్ లో తన ఆధిపత్యాన్ని చాటింది. అక్టోబర్ 2021 నుంచి తాజా వరల్డ్ ఛాంపియన్ షిప్ వరకు అంటే ఏడాది నర సమయంలో ఒక్కటంటే ఒక్క బౌట్ లోనూ ఓటమి ఎరుగని ఏకైక బాక్సర్ గా నిఖత్ రికార్డు సృష్టించింది. ఆమె సత్తాకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? రెండు జాతీయ ఛాంపియన్షిప్ లు, స్ట్రాంజా, రెండు వరల్డ్ ఛాంపియన్ షిప్ లు, కామన్వెల్త్ క్రీడలు.. ఇలా ఆడిన ప్రతి టోర్నీలోనూ నిఖత్ తిరుగులేని బాక్సర్ గా నిలిచింది. రింగ్ లోకి దిగిన ప్రతిసారీ విజయాన్ని ముద్దాడింది. ప్రస్తుతం తన కేటగిరిలోని మేటి బాక్సర్లను కంగుతినిపించి పతకాలు కొల్లగొడుతున్న నిఖత్.. సమీప భవిష్యత్తులో భారత బాక్సింగ్ క్వీన్ గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

భారత బాక్సింగ్ లో మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ అందుకున్న బాక్సర్ గా నిఖత్ చరిత్ర సృష్టించింది. త్వరలో ఈమె మేరీకోమ్ స్థానాన్ని భర్తీ చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సరిగా పన్నెండు సంవత్సరాల క్రితం జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గినప్పుడే.. తన టార్గెట్ వరల్డ్ ఛాంపియన్ కావడం అని చెప్పిన నిఖత్.. గత ఏడాదే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. మిగిలింది ఇక ఒలంపిక్స్, ఆసియా క్రీడలు మాత్రమే. ఇందులోనూ పతకాలు సాధిస్తే.. అన్ని టైటిళ్ళు సాధించిన క్రీడాకారిణి గా సృష్టిస్తుంది.
వాస్తవానికి నిఖత్ కు 2019లోనే వరల్డ్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటే అవకాశం రావలసి ఉండేది. ఆ ఏడాది నిఖత్ స్ట్రాంజాలో స్వర్ణం, థాయ్ లాండ్ ఓపెన్ లో రజతం మంచి ఫామ్ లో ఉంది. అయితే ఎటువంటి ట్రయల్స్ లేకుండా దిగ్గజ మేరికోమ్ ను జాతీయ బాక్సింగ్ సమాఖ్య వరల్డ్ ఛాంపియన్ షిప్ కు పంపడంతో నిఖత్ ఆశలు అడియాసలయ్యాయి. ఆ తర్వాత టోక్యో ఒలంపిక్స్ కి కూడా ట్రయల్స్ లేకుండానే మేరీని ఎంపిక చేస్తే.. నిఖత్ ఒక అవకాశం ఇవ్వాలంటూ గళం ఎత్తింది. ఒలంపిక్ ట్రయల్స్ లో మేరీ కోమ్ చేతిలో పరాభవం ఎదురైన తర్వాతే నిఖత్ అసలు సత్తా బయటపడింది. రింగ్ లో తన అటాకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది. బ్యాక్ ఫుట్ ను పూర్తిగా తగ్గించేసింది. డిఫెన్స్ ను మెరుగుపరుచుకుంది. ప్రత్యర్థిని అంచనా వేయడంలో పరిణతి సాధించింది. మరో ఏడాదిలో పారిస్ వేదికగా జరిగే ఒలంపిక్స్ లో భారతదేశానికి బాక్సింగ్ క్రీడలో తొలి స్వర్ణం అందించేందుకు నిఖత్ వేగంగా అడుగులు వేస్తోంది.