Women : ప్రస్తుత బిజీ లైఫ్ వల్ల సరైన ఆహారం తీసుకోవడం లేదు చాలా మంది. డైలీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఊబకాయం బారిన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. మరీ ముఖ్యంగా ఆడవారే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారని తెలుపుతున్నాయి సర్వేలు. పురుషుల కంటే మహిళలే ఇలా బరువు పెరగడం ఆందోళనకరం. చాలా మందికి అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారో తెలియకుండానే బరువు పెరిగేస్తున్నారు. అయితే ఇలా ఫాస్ట్ గా బరువు పెరగడంతో ఆందోళన మరింత పెరుగుతుంది. అయితే ఆడవారు వేగంగా బరువు పెరగడానికి కారణాలు ఉన్నాయి అవేంటో చూసేద్దాం..
ఆహారం: తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మహిళలు ఫాస్ట్ గా బరువు పెరిగిపోతుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే ఆడవారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే మీ ఆరోగ్యం పట్ల కచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి. రాత్రిసమయంలో వేయించిన ఆహారాలను తినకూడదు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆడవారు బరువు పెరుగుతారు. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ఒత్తిడి: ఆడవాళ్లు ఆఫీసుకు వెళ్లినా, గృహిణిగా ఉన్నా.. ఇంట్లో పనిభారం ఎప్పటికి వారి కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది కదా. నిజానికి ఆడవాళ్లకు ఎన్నో బాధ్యతలు మోస్తుంటారు. దీని వల్ల వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు అంటున్నారు నిపుణులు. అయితే ఈ ఒత్తిడి వల్ల శరీర బరువు కూడా పెరుగుతుందట. ఒత్తిడి వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ హార్మోన్ పెరిగి బరువు పెరుగుతారు. అందుకే మీ ఆరోగ్యం కోసం మీరు కచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
యాక్టివ్ : బరువు పెరగడానికి శారీరక శ్రమ లేకపోవడం కూడా ప్రధాన కారణమే. రోజంతా ఒకే దగ్గర కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్స్ పెరిగిపోతుంటాయి. ఇవి మీ బరువును పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఇంట్లో అన్ని పనులను చేసినా సరే శారీరక శ్రమ మాత్రం చేయరు. అందుకే త్వరగా బరువు పెరుగుతారు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలంటే ఇంటి పనులు చేయడం మాత్రమే సరిపోదు. దీనితో పాటు వ్యాయామం, యోగా, వాకింగ్ కూడా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
తక్కువ నిద్ర: బరువు పెరగడానికి మరొక ప్రధాన కారణం నిద్రలేమి. కంటినిండా నిద్రలేకపోతే మీరు బరువు పెరుగుతారట. నిజానికి నిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత మొదలై.. మెటబాలిజం మందగిస్తుంది. ఆకలి పెరుగి ఎక్కువ తింటారు. దీనివల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతుంది అంటున్నారు నిపుణులు.
ఆరోగ్య సమస్యలు: ఈ కారణాలు కాకుండా కొన్ని సార్లు అకస్మత్తుగా బరువు పెరుగుతారు. అంటే మీకు ఏవో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం. థైరాయిడ్ లేదా పీసీఓడీ సమస్యలు ఉన్న వారు కూడా బరువు పెరుగుతారు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత క్షీణించినప్పుడు కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు అకస్మత్తుగా బరువు పెరిగినా, తగ్గినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.