Bathukamma 2023: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా (విజయదశమి). దసరాకు ముందు జరుపుకునేది సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ 9 రోజుల ముందే బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. గ్రామాల్లో, పట్టాణాల్లోని వార్డుల్లో యువతులు, మహిళలు రోజుకో బతుకమ్మను పేర్చి సాయంకాలం సమయంలో ఒక్కచోట చేరి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. కొన్ని చోట్ల దాండియా ఆటలు ఆడుతారు. ఇలా తొమ్మిదిరోజుల పాటు సాంప్రదాయ పాటలు పాడుతూ సరదాగా ఉంటారు.
మొత్తం 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు మొదలవుతాయి. రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మగా పేర్చి సంబరాలు నిర్వహించుకుంటారు.అయితే ఆరో రోజు మాత్రం ఎలాంటి బతుకమ్మను పేర్చరు. ఈరోజును అలిగిన బతుకమ్మ అని అంటారు. అలిగిన బతుకమ్మ అనడం వెనుక ఓ స్టోరీ ఉంది.
ఆరో రోజు బతుకమ్మకు విరామం. ఈరోజు ఎలాంటి బతుకమ్మను పేర్చరు. దేవి భాగవతం ప్రకారం.. అమ్మవారు వివిధ రూపాల్లో రాక్షస సంహారం చేస్తుంది. మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి రూపాల్లో బండాసురుడు, చండములను సంహరిస్తుంది. ఇలా వరుసగా సంహరించిన తరువాత ఒకరోజు అలసిపోతారు. ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరోజు బతుకమ్మను పేర్చరు, ఆడరు. గ్రామాల్లో దీనినే అర్రెం అని కూడా అంటారు. అయితే ఏడవరోజు కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో 9 రోజుల్లో నిర్వహిస్తారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రకృతిలో దొరికే పూలను తెచ్చి ఒక్కచోట పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ తరువాత బతుకమ్మ మధ్యలో పసుపుతో గౌరమ్మను తయారు చేసి ఉంచి పూజలు నిర్వహిస్తారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ఒకచోట బతుకమ్మలను పెట్టి సాంప్రదాయ పాటలు పాడుతారు. ఆటలు ఆడుతారు. ఆ తరువాత బతుకమ్మలను నిమజ్జనం చేసి మహిళలు వాయినం ఇచ్చుకుంటారు. మహిళలు ప్రత్యేకంగా.. మహిళల కోసమే అన్నట్లుగా బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో వాడవాడలా ఘనంగా జరుగుతాయి.