Asia Cup 2022: ఆసియా కప్ లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ జట్లు అర్హత సాధించాయి. ఇక ఆరో జట్టు కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈ జట్లు తలపడనున్నాయి. ఇందులో నెంబర్ వన్ గా నిలచిన జట్టు ఆసియా కప్ లో పాల్గొంటుందని తెలిసిందే. క్వాలిఫయర్ రౌండ్ మ్యాచ్ లు ఆగస్టు 20 నుంచి 26 వరకు జరుగుతాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం అవుతుంది. 28న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. దీనికి గాను ఇప్పటికే టికెట్లు అమ్ముడయ్యాయి.

ఆసియా కప్ లో రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏ లో భారత్, పాకిస్తాన్ క్వాలిఫయర్ జట్లు ఉంటాయి. గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి. దీంతో ఒక్కో గ్రూపులోని జట్లు ఒక్కో జట్టుతో ఒక్కసారి తలపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్ స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ రౌండ్ కు చేరుతాయి. సూపర్ ఫోర్ రౌండ్లో మిగతా మూడు జట్లతో మ్యాచులు ఉంటాయి. మొదటి స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ అర్హత సాధిస్తాయి. ఫైనల్లో గెలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, పాకిస్తాన్ కెప్టెన్ గా బాబర ఆజమ్ ను ప్రకటించాయి.
ఆసియా కప్ టైటిల్ ఫేవరేట్ గా భారత్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే విజయాల జోరు మీదున్న టీమిండియాను అడ్డుకోవడం అంత సులభం కాదని తెలుస్తోంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలో వాటిని వైట్ వాష్ చేసి కప్ లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపుతో టీమిండియా కప్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ జట్టే విజయం సాధిస్తుందని ఇరు జట్ల అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇప్పటికే ప్రసార మాధ్యమాల్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అభిమానుల ఆశలు ఏ మేరకు తీరుతాయో తెలియడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రెండు దేశాల ప్రజలు మ్యాచ్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. కప్ గెలవాలని ఇరు జట్లు ఆశగా ఉన్నాయి. ఎవరి కోరిక తీరుతుందో తెలియడం లేదు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇండియాకే విజయావకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.

