Navratri Ayudha Pooja: హిందూ మతంలో శక్తి ఆరాధనకు గొప్ప పండుగ దసరా నవరాత్రులు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడంతోపాటు చాలా ముఖ్యమైనదిగా భావించే ఆయుధ పూజ చేస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 23న దసరా జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయిజ మాసం శుక్లపక్ష తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 22 రాత్రి 07:58 గంటలకు ప్రారంభమై 23వతేదీ సాయంత్రం 05:44 వరకు కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం ఆయుధ పూజకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా పరిగణించబడే సుముహూర్తం అక్టోబర్ 23వ తేదీన 1:58 నుండి 2:43 గంటల వరకు వరకు ఉంటుంది. ఆయుధ పూజ హిందూమతపరమైన ప్రాముఖ్యత.. దీని పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆయుధ పూజపై పౌరాణిక కథ
హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రులలో ఆయుధాల పూజ మహిషాసురమర్దిని కథతో ముడిపడి ఉంది. పురాణ కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొందిన తరువాత భూమిపై నివసించే ప్రజలను హింసించడం ప్రారంభించాడు. తనకు స్త్రీవలన తప్ప మరెవరి వల్ల మరణం రాకూడదని బ్రహ్మదేవుడి వద్ద వరం పొందాడు. ఆ మహిషాసురుడి దేవతలను, మానవులను, మునులను విపరీతంగా హింసించడం పెరిగిపోవడంతో దేవతలు, ఋషులు మొదలైనవారు ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మదేవుడిని ప్రార్థించగా, మహిషాసురుని వధించే బాధ్యతను దుర్గాదేవికి అప్పగించాడు.
దేవతలందరి ఆయుధాలు..
బ్రహ్మదేవుడు బాధ్యతలు అప్పగించిన తర్వాత మహిషాసురుడిని చంపడానికి దేవతలందరూ తమ ఆయుధాలను దుర్గాదేవికి ఇచ్చారు. దుర్గాదేవి రాక్షసుడిని సంహరించే సమయంలో ఆయుధాలను పూజించగా రాక్షస వధ అనంతరం దుర్గాదేవి విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ విజయదశమిగా దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజించారని నమ్మకం.
ఆయుధాలను ఎప్పుడు, ఎలా పూజించాలి
నవరాత్రుల్లో మీ ఆయుధాలను పూజించడానికి ముందుగా ఉదయం స్నానం చేసి.. ధ్యానం చేసిన తర్వాత.. శరీరం, మనస్సుని నిర్మలంగా ఉంచుకుని మొదట దుర్గా దేవిని అన్ని నియమాలతో పూజించండి. ఆ తర్వాత ఆయుధాలను జాగ్రత్తగా శుభ్రం చేసిన తర్వాత.. గంగాజలంతో వాటిని శుద్ధి చేయండి. దీని తరువాత పసుపుని పూసి.. గంధం, తిలకం మొదలైన వాటితో బొట్టుపెట్టి పూజించండి. అనంతరం ఆయుధాలకు పువ్వులు సమర్పించి ఆనందం, అదృష్టం, భద్రత కోసం ప్రార్థించండి.
వీటిని కూడా పూజిస్తారు
ఆయుధాలే జీవనాధారం అని నిరూపిస్తున్న ప్రస్తుత కాలంలో ఆయుధపూజ రోజున ఆయుధాలను మాత్రమే కాదు పెన్నులు, స్క్రూడ్రైవర్లు, వాహనాలు, సంగీత వాయిద్యాలు, యంత్రాలు మొదలైనవాటిని కూడా పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఆయుధ పూజ రోజున లక్ష్మీదేవిని, సరస్వతీ దేవిని దుర్గాదేవి నల్లని రూపాన్ని పూజించే సంప్రదాయం ఉంది.