Adhika Sravana Masam: తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢం పూర్తవగానే శ్రావణం వస్తుంది. కానీ పండితులు చెబుతున్న ప్రకారం 2023లో రెండు శ్రావణాలు వస్తున్నాయి. జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు ఒక శ్రావణంగా.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 18 వరకు రెండో శ్రావణంగా పేర్కొంటున్నారు. ఆషాడంలో బోనాలు ఉత్సవాలు చేసుకున్న ప్రజలు శ్రావణంలో పూజలు, వ్రతాలు చేస్తారు. కొందరు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈనెలలోనే పండుగ సీజన్ ప్రారంభమవుతుంది కూడా. అయితే ఇప్పుడు వచ్చే రెండు శ్రావణాల్లో ఏ శ్రావణంలో పూజలు చేయాలి? ఏ శ్రావణంలో చేయకూడదు? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ క్లారిటీ మీకోసం..
జ్యోతిష్యులు చెబుతున్న చంద్రాయాణం ప్రకారం తెలుగు సంవత్సరం ప్రతి నెలలో 29 రోజులు మాత్రమే ఉంటుంది. ఇలా 32 నెలల పాటు ఒక్కో రోజు మిగులుతూ వస్తుంది. ఇలా మిగలిన రోజులన్నింటిని కలిపి అధికమాసంగా పిలుస్తారు. 2020లో అధిక ఆషాఢ మాసం వచ్చింది. ఇప్పుడు 2023లో అధిక శ్రావణం వచ్చిందని పండితులు చెబుతున్నారు.అయితే ఇప్పుడు వచ్చిన ఏదీ అధిక శ్రావణం? ఏది నిజమైన శ్రావణం ? అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు వచ్చే మాసాన్ని అధిక మాసం అంటారు. దీనినే శూన్యమాసంగా పేర్కొంటారు. అంటే ఇలా వచ్చే శ్రావణంలో ఎలాంటి పూజలు నిర్వహించకూడదని అంటున్నారు. ఈ మాసంలో వ్రతాలు గానీ, ఉపవాసాలు కూడా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే పితృధర్మ కార్యక్రమాలు నిర్వహించాలని చెబుతున్నారు. అంతేకాకుండా దాన ధర్మాలు కూడా చేయాలని చెబుతున్నారు.
ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ కాలంలో నిజమైన శ్రావణంగా పేర్కొంటున్నారు. ఈ కాలంలోనే నాగపంచమి, వరలక్ష్మీ వ్రతం,రాఖీ పౌర్ణమి లాంటి పండుగలు వస్తున్నాయి. కొందరు ఉపవాసాలు ఉండాలనుకునేవారు కూడా దీనినే ఎంచుకోవాలని చూస్తున్నారు. మాములు రోజుల్లో చేసే పూజల కంటే శ్రావణ మాసంలో చేసే పూజలు అధిక ఫలితాన్నిస్తాయని చెబుతూ ఉంటారు. ఇక ఇక్కడి నుంచి పండుగ ప్రారంభమై ఆ తరువాత ఉగాది వరకు పండుగలు కొనసాగుతాయని అంటున్నారు.