
Do not Donate After Dark: మన హిందూ ధర్మం ప్రకారం దానధర్మాలు చేయడం మంచిదిగా చెబుతారు. జీవితంలో మనం ఎంతో కొంత దానం చేస్తేనే మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇందులో భాగంగానే మన దగ్గర ఉన్న వాటిని కొన్నింటిని దానం చేయాలని భావిస్తారు. కానీ ఏవి దానం చేయాలి? ఏ సమయంలో దానం చేయాలి అనే విషయాల మీద అవగాహన తక్కువే. ఈ నేపథ్యంలో మనం చేసే దానాలే మనకు పుణ్యం ఇస్తాయని విశ్వసిస్తారు. కానీ మనం చేయకూడనివి చేస్తే మనకు ప్రతికూల అంశాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మన సంపదను కోల్పోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. సాయంత్రం సమయంలో దానం చేయకూడనివి ఏంటో తెలుసుకుని చేయడం మంచిది.
సూర్యాస్తమయం సమయంలో..
సూర్యుడు కనబడకుండా పోయాక మనం కొన్ని పనులు చేయకూడదు. కొన్ని దానాలు చేయడం కూడా సురక్షితం కాదు. సూర్యాస్తమయంలో పాలు, పెరుగును దానం చేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. పాలను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెబుతారు. అందుకే పొరపాటున కూడా సాయంత్రం సమయంలో పాలు, పెరుగు దానం చేయకుండా ఉండటమే ఉత్తమం. ఒకవేళ అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీంతో డబ్బుకు ఇబ్బందులు పడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది.
పసుపు
సూర్యాస్తమయం తరువాత పసుపును దానం చేయకూడదు. పసుపు బృహస్పతికి ప్రతీకగా చెబుతారు. పసుపును శుభ కార్యాల్లో విరివిగా ఉపయోగిస్తారు. పసుపు లేకుండా ఎలాంటి శుభ కార్యాలు కూడా జరగవు. చీకటి పడిన తరువాత పసుపు దానం చేస్తే అరిష్టమే. బృహస్పతి సంపదకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి పసుపును దానం చేయడం వల్ల మన సంపదను దానం చేసినట్లు అవుతుంది. అందుకే సాయంత్రం పూట పసుపును ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయడం సురక్షితం కాదు.
ఉల్లి, వెల్లుల్లి
సాయంకాలం సమయంలో ఉల్లి, వెల్లుల్లిలను దానం చేయడం కరెక్టు కాదు. చీకటి పడిన తరువాత కొన్ని గ్రహాల ప్రభావం కొన్నింటిపై పడుతుంది. ఈ క్రమంలో సూర్యాస్తమయం తరువాత ఉల్లి, వెల్లుల్లిని దానం చేయకూడదని చెబుతుంటారు. పొరపాటున చేస్తే మనకు నష్టం. ఈ విషయాలు తెలుసుకుని సాయంత్రం సమయంలో వీటిని దానంగా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ చేసినట్లయితే మనకే ఆర్థికంగా నష్టం వస్తుంది. సంపద కోల్పోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.