
IPL 2023 Delhi Capitals : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం లేదు. జట్టులో దిగ్గజాలు లేనప్పటికీ.. డగౌట్ లో మాత్రం హేమాహేమీలైన మాజీ క్రికెటర్లు ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా జట్టును మార్పు చేయగల సమర్థత వీరి సొంతం. కానీ, ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నారు. లోపం ఎక్కడ ఉందో అర్థం కాక అభిమానులు బుర్ర పగలగొట్టుకుంటున్నారు. అన్ని విధాలుగా సమర్థమైన జట్టు అయినప్పటికీ కొన్ని తప్పిదాలతో ముందుకు సాగలేకపోతోంది.
ఈ ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు అభిమానులను ఉసురుమనిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఇలా జరగడంతో జట్టుపై ప్రభావం ఉంటుందని అంత భావించారు. పంత్ లేని లోటును మిగతా క్రికెటర్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చని యాజమాన్యం భావించింది. అందుకు అనుగుణంగానే కీలక ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ ఢిల్లీ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబడటం లేదు.
డగౌట్ లో దిగ్గజాలు.. అక్కరకు రాని సమర్ధత..
ఢిల్లీ జట్టులో హేమాహేమీ ప్లేయర్లు లేకపోయినప్పటికీ.. సీనియర్.. జూనియర్ల సమతూకంతో ఉంది జట్టు.. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. జట్టు ఎంత బలంగా ఉన్నప్పటికీ.. వారిని వెనుక నుండి నడిపించే సమర్థమైన కోచ్ లు.. సలహాదారులు అవసరం. ఢిల్లీ జట్టుకు అది కూడా తక్కువ కాదు. హెడ్ కోచ్ గా రికి పాంటింగ్, డైరెక్టర్ గా సౌరబ్ గంగూలీ లాంటి దిగ్గజాలు.. కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ లాంటి సీనియర్ ఆటగాడు ఉన్నప్పటికీ ఆ జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదు. గత సీజన్ లో వరుసగా ప్లే ఆఫ్ వరకు చేరి.. మంచి జట్టుగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ.. ఈ సీజన్లో ఇప్పటి వరకు బోనీ కూడా కొట్టలేకపోయింది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేకపోయింది. తొలి విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంది ఈ జట్టు. ఐపీఎల్ లో మిగతా జట్లు బోనీ కొట్టి పాయింట్లు పట్టికలో ముందుకెళ్తుంటే.. ఢిల్లీ జట్టు మాత్రం అన్ని విభాగాలు విఫలమవుతూ ఆప సోపాలు పడుతోంది. ఒక్క విజయం కోసం ఆశగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఈ జట్టు అభిమానులకు ఏర్పడింది.
జట్టులో కొరవడిన సమిష్టి ఆట..
ఏ జట్టు విజయంలోనైనా సమిష్టి కృషి అవసరం. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో అదే కొరవడింది. ఒకరిద్దరూ ఆటగాళ్లు తప్పిస్తే ఎవరు పెద్దగా రాణించలేకపోవడంతో విజయాలు దరి చేరడం లేదు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో జట్టు పగ్గాలను వార్నర్ కి అప్పగించారు. అందుకు తగ్గట్టే ప్రతి మ్యాచ్ లో వార్నర్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడు అర్థ శతకాలు నమోదు చేశాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 228 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు వార్నర్. అయితే, అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. టాప్ ఆర్డర్ కుప్పకూలుతుండడంతో వార్నర్ ఒక్కడే జట్టును గట్టెక్కించలేకపోతున్నాడు. ఇక ఆల్రౌండర్ మార్ష్ ఇప్పటి వరకు రాణించింది లేదు. దీంతో జట్టుకు ఓటములు తప్పడం లేదు. మరోపక్క అక్షర పటేల్ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వార్నర్ తర్వాత ఆడుతున్నది ఆల్రౌండర్ అక్షర పటేల్ మాత్రమే. ముంబై జట్టుపై అర్థ శతకాన్ని (54) నమోదు చేయగా, గుజరాత్ జట్టుపై బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (36) ఆడి జట్టుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అటు బంతితోను అక్షర పటేల్ రాణిస్తున్నాడు. ఇక మనీష్ పాండే బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అర్థ శతకం నమోదు చేసినప్పటికీ గత మ్యాచ్ లో పెద్దగా రాణించలేకపోయాడు.
నమ్మకాన్ని వమ్ము చేస్తున్న పృథ్వి షా..
ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ లో అత్యంత కీలకమైన ప్లేయర్ పృథ్వి షా. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సామర్థ్యం ఈ యువ క్రికెటర్ సొంతం. ఈ సీజన్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఓపెనర్ ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. జట్టుకు బలంగా ఉంటాడనుకున్న ఈ ఆటగాడు ఇప్పుడు భారంగా తయారయ్యాడు. రెండు సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన మ్యాచ్ ల్లో చేసిన పరుగులు.. 12, 7, 15 మాత్రమే. ఈ గణాంకాలను చూస్తే అతడు ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదేపదే ఒక రకమైన షాట్లకు ప్రయత్నించి అవుట్ అవుతున్నప్పటికీ.. తప్పులనుంచి ఏమాత్రం నేర్చుకోవడం లేదు. అతడితో కలిసి ఆడిన సహచర ఆటగాడు సుభ్ మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతుంటే.. షా ఇంకా ఐపీఎల్ లోనే ఇబ్బంది పడుతున్నాడు. అతడి ప్రదర్శన పై పలువురు మాజీలు విమర్శలు చేస్తున్నారు.
తేలిపోతున్న బౌలింగ్ విభాగం..
బ్యాటింగ్ విభాగంలో ఒకరిద్దరు మినహా ఎవరు రాణించకపోవడంతో మెరుగైన స్కోర్ చేయలేక పోతుంది ఢిల్లీ జట్టు. చేసిన ఆ స్కోర్ ను కూడా రక్షించుకోలేక ఇబ్బందులు పడుతోంది ఢిల్లీ జట్టు. దీనికి కారణం బౌలింగ్ విభాగం తేలిపోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, నోకియా, అక్షర పటేల్, ముస్తాఫిజర్, కులదీప్ యాదవ్ లాంటి వారితో బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ.. ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ధారాళంగా పరుగులు సమర్పిస్తూ జట్టును కాపాడుకోలేకపోతున్నారు. పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ లపై తేలి పోవడం ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బెడిసి కొడుతున్న వ్యూహాలతో ఓటమి..
ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఓటమికి బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాలు ఎంత కారణమో.. సరైన ప్రణాళికలతో ముందుకు రాకపోవడం అంతే కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణాళికలను అమలు చేయడంలో ఆ జట్టు పూర్తిగా గందరగోళానికి గురవుతోందని మాజీ కెప్టెన్ సెహ్వాగ్ విమర్శలు గుర్తించాడు. గతంలో జట్టు ప్లే ఆప్స్ వరకు చేరేందుకు సహకరించిన పాంటింగ్, గంగూలీ.. ఈసారి ఓటములకు బాధ్యత తీసుకోవాలని సూచించాడు. రాబోయే మ్యాచ్ ల్లోనైనా సరైన ప్రణాళికలతో ముందుకు వచ్చి విజయాలు బాట పట్టాలని ఆకాంక్షించాడు. ఇకపోతే ఈ సీజన్ లో ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ ఢిల్లీ జట్టుకు కీలకంగా మారనుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్టే ప్లే ఆఫ్స్ కు చేరుతాయి. ఈ నేపథ్యంలో విజయాలతోపాటు నెట్ రన్ రేటు ఎంతో కీలకంగా మారుతుంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు రేసులో నిలవాలంటే.. ఇక నుంచి ప్రతి మ్యాచ్ లో విజయంతోపాటు మంచి రన్ రేట్ సాధించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.