Karthika Masam Snanam: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. అత్యంత భక్తిశ్రద్ధలతో నెల రోజుల పాటు పూజలు నిర్వహిస్తుంటారు. వచ్చే నెల 23న కార్తీక మాసంతో ఈ మాసం ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు నదీస్నానాలు చేసేందుకు మొగ్గు చూపుతారు. సముద్ర, నదీ స్నానాలు చేసి భక్తిభావంతో ఉంటారు. ఈ మేరకు దేవాలయాలు కిటకిటలాడతాయి. భక్తుల సమూహంతో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. పవిత్రమైన మాసం కావడంతో ఉపవాస దీక్షలు చేస్తుంటారు. తీర్థ యాత్రలు చేసే వారు, మాల ధరించేవారు నదీ తీరాల్లో స్నానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో కార్తీక మాసం మొత్తం భక్తభావమే నిండి ఉంటుంది. భక్తుల ఆలోచనలు అన్ని అటు వైపే వెళ్తుంటాయి.

నోములు నోచుకునే వారు, ఏదైనా కొత్త పని మొదలు పెట్టే వారు కూడా ఇదే మాసాన్ని ఎంచుకుంటారు. దీంతో ఈ మాసంలో ప్రజల్లో భక్తి ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహం లేదు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం దేవస్థానం కార్తీక పూజలకు ముస్తాబైంది. ఇక్కడ భక్తులు నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. దీనికి గాను అందంగా అలంకరించారు. శ్రీశైలంలో నేటి నుంచి నవంబర్ 23 వరకు కార్తీక మాసం ఉత్సవాలు తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు.
దేవస్థానంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు దీపారాధన చేయడం కోసం ఎక్కువ మంది ఇష్టపడతారు. స్వామి వారి సన్నిధిలో నాగులకట్ట ప్రాంగణం వద్ద ఈ ఏడాది భక్తులు దీపారాధన చేయడాన్ని రద్దు చేసి గంగాధర మండలం వద్ద ఉత్తర మాఢ వీధిలో భక్తులు దీపారాధన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో శ్రీశైల క్షేత్రం భక్తుల సందడితో మారుమోగనుంది. కార్తీక శోభ అందరిలో సంతోషం నింపనుంది. ఆలయ ఈవో లవన్న అధ్యక్షతన దేవస్థాన అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు.

ఆలయం ఉదయం 3.30 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవల టికెట్ల జారీకి అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర, ప్రత్యేక దర్శనాల టికెట్లు అందుబాటులో ఉంచారు. దీంతో కార్తీక మాసం సందర్భంగా దేవాలయం భక్తుల కోసం ఏ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని సేవలు ఏర్పాటు చేస్తున్నారు.