Pregnancy : గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఆహార విషయంలో కోరికలు పెరగడం, శరీర బరువులో మార్పులు, శరీర ఆకృతిలో మార్పులు, హార్మోన్ స్థాయిలో మార్పులు రావడం వంటివన్నీ జరుగుతాయి. వీటితో పాటు గుండె ఆకారం మారడం, జుట్టు పెరగడం, బరువు పెరగడం, చర్మ రంగు, దంతాల్లో కూడా మార్పులు వస్తాయట. ఈ మార్పులు ఎందుకు వస్తాయి. ఈ మార్పులు రావడం సహజమేనా? వంటి విషయాలు గురించి ఈ రోజు తెలుసుకుందాం.
గుండె ఆకారం మారుతుందా?
గర్భధారణ సమయంలో మహిళల గుండె ఆకారం మారుతుందట. పిండం పెరుగుదల బట్టి ఇతర అవయవాలు కూడా ఉబ్బుతాయి. దీంతో గుండె ఒత్తిడికి గురై.. తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ప్రెగ్నెన్సీలో సమయంలో గుండె చుట్టూ మందపాటి కండరాల గోడను కట్టుకుంటుంది. అలాగే కడుపులో ఉన్న బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందాలంటే శరీరంలో రక్తప్రసరణ ముఖ్యం. ఇలా గుండె ఆకారం మారడం వల్ల పిండం పెరుగుదలకు మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
జుట్టు పెరుగుతుందా?
చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుంది. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలకు జుట్టు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం కురులు మాత్రమే కాకుండా శరీరంలో అవాంఛిత వెంట్రుకలు కూడా పెరుగుతాయట.
బరువులో మార్పులు?
గర్భధారణ సమయంలో బరువు పెరగడం కామన్. ఎందుకంటే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తల్లి పౌష్టికాహారం తీసుకుంటుంది. దీంతో బరువు పెరుగుతారు. కొందరు డెలివరీ తర్వాత బరువు తగ్గుతారు. కానీ మరికొందరు అలానే ఉండిపోతారు.
చర్మ రంగు మారుతుందా?
కొంతమంది మహిళలకి పెళ్లయిన తర్వాత చర్మరంగు మారుతుంది. మరికొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో స్కిన్ గ్లోగా ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ ఈ సమయంలో కూడా అందరి చర్మం మెరుస్తూ ఉండదట. కొందరు మహిళల చర్మం ఈ సమయంలో నల్లగా మారుతుందట. మళ్లీ డెలివరీ తర్వాత నార్మల్ స్థితికి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దంతాలు కూడా మారుతాయా?
ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ పెరుగుదల వల్ల నోటి ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం, దంత క్షయం వంటివి వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. వీటితో పాటు పళ్లు కూడా కదులుతాయి. మరికొందరికి అయితే పళ్లు రాలిపోతాయి. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుందట.