Vastu Tips For Home: దేవాలయం పవిత్రమైన స్థలం. దేవుని గుడి సమీపంలో ఇల్లు ఉండొద్దంటారు. అలా ఉంటే మనకే నష్టం అని చెబుతారు. ఆలయాల నుంచి వచ్చే తరంగాలను తట్టుకునే శక్తి ఇళ్లకు ఉండదు. అందుకే దేవాలయాల సమీపంలో ఇళ్లు ఉండకూడదంటారు. ధ్వజస్తంభం నీడ కూడా ఇంటిపై పడకూడదు. అలా పడితే మనకు అరిష్టమే. ఈ నేపథ్యంలో దేవాలయాల సమీపంలో ఇల్లు నిర్మించుకోవడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతుంటారు.
ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే ఎలాంటి నష్టం ఉండదు. కానీ దేవాలయానికి సమీపంలో ఉంటే ఇబ్బందులే వస్తాయి. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో ఉండే మూలవిరాట్టు విగ్రహం నుంచి లెక్కలోకి తీసుకుంటే మన ఇల్లు ఎంత దూరం ఉందో తెలుసుకోవచ్చు.
శివాలయాలకు వెనుక, విష్ణు ఆలయాలకు ముందు ఇల్లు ఉండొచ్చు. శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం కలుగుతుంది. విష్ణు ఆలయానికి దగ్గరలో ఉండే ఆ ఇంట్లో డబ్బు నిలవదని అంటుంటారు. అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉంటే ఆ ఇంట్లో పురోగతి ఉండదని చెబుతారు. వినాయకుడి ఆలయం ఉత్తరం, వాయువ్యం వైపు ఇల్లు ఉంటే ధననష్టం కలుగుతుంది.
పూర్వం ఆలయాలు నదీతీరంలోనో, పర్వతాల పైనో నిర్మించేవారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న నగరాలతో ఆలయాలు ఇళ్ల మధ్యనే ఉంటున్నాయి. ఆలయాలకు సమీపంలో ఇల్లు ఉంచుకోవడం సురక్షితం కాదు. ఈ విషయం తెలుసుకుని దేవాలయాల సమీపంలో ఇంటిని నిర్మించుకునే పనులు మానుకోవడమే మంచిది.