Vastu Tips: అన్ని దేవుళ్లకంటే ముందు వినాయకుడిని పూజించాలి అంటారు. అయితే ఈయనను పూజించాలి అంటే గుడికి వెళ్లాల్సిందే. లేదా వినాయక చవితి సందర్భంగా ఇంటి ముందుకు వస్తాడు గణేషుడు. అయితే కొందరు వినాయకుని విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటారు. ఇంతకీ ఈ దేవున్ని ఇంట్లో పెట్టుకోవాలా వద్దా? పెట్టుకుంటే ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలి అని కొందరికి సందేహాలు ఉంటాయి. అసలు తొండెం ఎటు వైపు ఉన్న గణేషున్ని పెట్టుకోవాలి? ఎడమవైపా? కుడివైపా అనే సందేహాలు మీకు ఉన్నాయా? అయితే ఇది చదివేయండి..
కుడివైపు తొండం ఉంటే లక్ష్మీ గణపతి అంటారు. తొండం లోపల వైపు ఉంటే తపో: గణపతి అంటారు. ఇక తొండం కనుక ముందు వైపుకు ఉంటే ఆ విగ్రహానికి అసలు పూజలు చేయకూడదట. ఒక దంతం విరిగిన గణపతిని రుద్రగణపతి అంటారు. ఈ విగ్రహానికి కూడా పూజలు చేయకూడదట. అయితే ఈ దేవున్ని పూజించేటప్పుడు ఎలుక కచ్చితంగా ఉండాలట. గణపతి ఎలుక వేరుగా ఉన్న విగ్రహం అసలు తీసుకోకూడదట. రెండు ఒకే ప్రతిమలో ఉండాలట. అంతే కాదు గణపతి ముఖంలో చిరునవ్వు ఉండేలా చూసుకోవాలట.
చిరునవ్వు ఉండే గణపతి ఇంట్లో ఉంటే సుఖ, శాంతులు పెరుగుతాయట. ముఖ్యంగా గణపతికి చతుర్భాజాలు ఉండేలా చూసుకోవాలట. ఒక చేతిలో లడ్డూ, మరో చేతిలో కమలం, ఇంకో చేతిలో శంఖం, నాలుగో చేతిలో ఏదైనా ఆయుధం ఉండాలట. అంతే కాదు వినాయకుడి తొండం ఎల్లప్పుడు ఎడమవైపుకు ఉండేలా చూసుకోవాలట. గణేషుడి తొండం ఎప్పుడు కూడా తన తల్లి గౌరీ దేవి దిక్కుగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు.
దక్షిణాముఖి గణపతి విగ్రహాలను కేవలం గుడిలో మాత్రమే ప్రతిష్టిస్తారు. గణపతి ముందు ముఖం సంపదను సూచిస్తే.. వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వెనుక ముఖం ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలట. ఇక ఇంటి దక్షిణ దిశలో గణేష్ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దట. తూర్పు లేదా పశ్చిమ దిశలో పెట్టుకోవచ్చట.