Valentine’s day : వాలెంటైన్స్ డే అంటే ప్రేమికులు మాత్రమే జరుపుకునేది. అంటే మింగిల్ గా ఉంటేనే ఈ వేడుకలకు అర్హులు. అయితే దీనికి సరికొత్త అర్థం చెప్పారు సింగిల్ గా ఉండేవాళ్ళు. ప్రేమంటే ఇచ్చి పుచ్చుకోవడం మాత్రమే కాదని.. ప్రేమను కలిగి ఉండటం కూడా ప్రేమే అని నిరూపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాదు లాంటి మెట్రో నగరాల్లో కొన్ని సంస్థలు సర్వే నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రేమ వర్కౌట్ కాకపోవడం వల్లో.. ప్రేమించిన వాళ్ళు మోసం చేయడం వల్లో.. తెలియదు గాని చాలామంది సింగిల్స్ హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లకు ఒంటరిగానే వచ్చారు. రుచికరమైన ఆహారాన్ని తీసుకున్నారు. కొందరైతే వైన్ కూడా పుచ్చుకున్నారు. సెల్ ఫోన్ చూసుకుంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు తిలకిస్తూ.. తమలో తాము నవ్వుకున్నారు. అలా తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగించారు.
సింగిల్స్ కోసం కొన్ని ఈవెంట్ సంస్థలు సృజనాత్మక వ్యక్తికరణ పేరుతో ఎగ్జిబిషన్స్ నిర్వహించాయి. ఇందులో కొంతమంది సింగిల్స్ పెయింట్స్ వేశారు. కొంతమంది క్రాఫ్టింగ్ రూపొందించారు. ఇంకా కొంతమంది తమ ఊహాశక్తి ఆధారంగా కవితలు రాశారు. వర్చువల్ హ్యాంగ్ అవుట్ పేరుతో స్నేహితులతో తనివి తీరా మాట్లాడారు.
పార్కులు, ఇతర ప్రాంతాలు సింగిల్స్ తో కిటకిటలాడాయి. ఒంటరిగా లాన్ లో కూర్చుని అలా ప్రకృతిని ఆస్వాదించారు. ముక్కుల నిండా స్వచ్ఛమైన గాలిని పీల్చారు.. ఇంకా కొందరైతే మొక్కలు కూడా నాటారు. సరదాగా వాకింగ్ చేశారు.
ప్రేమికుల తోనే కాదు.. సింగిల్స్ తో స్పా, మసాజ్ సెంటర్లు కిటకిటలాడాయి. స్త్రీ, పురుషులు అని తేడా లేకుండా స్వీయ సంరక్షణపై దృష్టి సారించారు. మగవాళ్ళయితే మసాజ్ చేయించుకోగా.. స్త్రీ లు కేశాలు, ముఖానికి సంబంధించిన చికిత్సలు చేయించుకున్నారు.
ఇది మాత్రమే కాదు యోగా సెంటర్లు, స్పిర్చువల్ సెంటర్లు కూడా సింగిల్స్ తో సందడిగా మారాయి. ప్రేమ వారికి దక్కలేదనో, ప్రేమ వల్ల ఇబ్బంది పడ్డారో తెలియదు గాని.. ప్రశాంతతను పొందేందుకు రకరకాల ప్రక్రియలు అవలంబించారు.
స్థూలంగా చెప్పాలంటే ఒక వ్యక్తితో కలిసి ఉంటేనే ప్రేమ కాదు. ఒక వ్యక్తి మనల్ని ఆరాధిస్తేనే ప్రేమ సొంతం కాదు. ప్రేమంటే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా అన్నింటిని అంగీకరించడం. ఎదుటి వ్యక్తిని ప్రేమించే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ఆస్వాదించుకోవాలి. మన తప్పుల్ని, మన ఒప్పుల్ని అంగీకరించుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వం అలపడుతుంది. అలాంటి వ్యక్తిత్వం ఎదుటి మనిషి సాంగత్యంలో బలపడుతుంది. దీనినే నిజమైన ప్రేమ అంటారు.