
TSPSC Paper Leakage: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో.. ప్రధాన పరీక్షలు రీ షెడ్యూల్ అయ్యాయి. ఈ మేరకు పబ్లిక్ కమిషన్ అధికారులు మంగళవారం ఉదయం ఒక స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కమిషన్ అధికారులు కొంతకాలం నుంచి దీని మీద కసరత్తు చేస్తున్నారు. రద్దయిన పరీక్షలతో పాటు, ఇప్పటికే ప్రకటించి, భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ప్రధాన పరీక్షలకు సంబంధించి ఒక టీ రెండు రోజుల్లో రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏ ఈ ప్రశ్న పత్రం లీక్ అయిన నేపథ్యంలో.. ఇప్పటికే నిర్వహించిన నాలుగు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది. ఆరు పరీక్షల్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని మాత్రమే అధికారులు ఇప్పటివరకు ప్రకటించారు. జూన్ 11 న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా ఐదు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. మే 17న జరగాల్సి ఉన్న లైబ్రెరియన్స్, ఫిజికల్ డైరెక్టర్లు, ఏప్రిల్ 25న జరగాల్సి ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు, మే 7న జరగాల్సి ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, మే 13న జరగాల్సి ఉన్న పాలిటెక్నికల్ లెక్చరర్ల వంటి పోస్టుల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. రద్దయిన ఐదు పరీక్షల తేదీలను ఖరారు చేసేందుకు వీలుగా ఇప్పటికే ప్రకటించిన పరీక్షల్లో కూడా మార్పులు జరగవచ్చని తెలుస్తోంది.
గ్రూప్_3 పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించాల్సి ఉంది. పోస్టులకు కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఈ పరీక్ష నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంటుంది. గ్రూప్_2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీలలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షల్లో కూడా మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రూప్_4 పోస్టులకు జూలై 1వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు 9.50 దరఖాస్తులు వచ్చాయి. ఈ స్థాయిలో అభ్యర్థులకు ఏకకాలంలో పరీక్ష నిర్వహించాలంటే.. అందుకు తగిన విధంగా పరీక్ష కేంద్రాలు ఉండాలి. ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లను కూడా అదే స్థాయిలో ముద్రించాలి. ప్రస్తుతం కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో నియామక క్యాలెండర్ పూర్తిగా గతి తప్పింది.