Heart Disease: రెండేళ్ల క్రితం అపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్ను మూసారు. ఏడాది క్రితం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇదే తీరుగా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మొన్నటికి మొన్న సినిమా నటుడు కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు. కోవిడ్ అనంతర మార్పుల వల్ల ఈ మరణాలు సంభవించాయని వైద్యులు చెబుతున్నా.. అంతిమంగా మాత్రం ఈ మరణాలకు కారణం హృద్రోగాలే.

నిమిషానికి హృదయ స్పందన 72 సార్లు, రక్త పీడనం 120/80 ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ 72 స్థానంలో సంఖ్య పెరిగినా.. ఆ రక్త పీడన విషయంలో అంకెలు మారినా..ముప్పు ఉందని అర్థం. దీన్నే వైద్య పరిభాషలో చెప్పాలంటే గుండెపోటు అంటారు. చాతిలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది లాంటివి గుండె పోటు సమస్యను తెలిపే ప్రధాన లక్షణాలు. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిలో గుండెపోటు ఉందని చెప్పలేం. ఇవి ఎలాగూ గుండెపోటు తాలూకు లక్షణాలు కావని అవసరమైన పరీక్షలు చేయించుకోకుండా ఉండిపోవడం కూడా సరి కాదు. కండరాలతో నిర్మితమైన గుండె మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. మూత్రపిండాల నుంచి మొదలు పెడితే కాలేయం దాకా ప్రతి కీలకమైన అవయవానికి రక్తాన్ని అందజేస్తుంది. ఇలాంటి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో లేదా “కొరోనరీ అర్టేరీ” పూడికలు గుండె జబ్బులకు దారి తీస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కలిగిన వాళ్లు, జన్యుపరమైన మబ్బు కలిగిన వాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్లు, ఎక్కువ శాతం కూర్చుని ఉండేవాళ్ళల్లో రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. ఇది రక్త రవాణాకు అడ్డంకిగా మారుతుంది. ఫలితంగా గుండె జబ్బులు మొదలై ఆ తాలూకు లక్షణాలు మొదలవుతాయి. ఆయాసం, చాతిలో నొప్పి, అసౌకర్యం, గుండె దడ, కళ్ళు తిరగటం.. ఇలా వేరువేరు లక్షణాల రూపంలో గుండె సమస్యలు బయటపడతాయి. అయితే కొందరిలో ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉండి, గుండెపోటుకు దారి తీస్తే, ఇంకొందరిలో రక్తనాళాలు నూరు శాతం పూడుకు పోయి లక్షణాలు ఆకస్మాత్తుగా తలెత్తి, గుండెపోటు రావచ్చు.
ఎటువంటి పరీక్షలు
సాధారణంగా గుండె సమస్య లక్షణాలు మొదలైనప్పుడు, సమస్యను నిర్ధారించుకునేందుకు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరికి ముందు నుంచి ఎటువంటి లక్షణాలు కనిపించకుండా, హఠాత్తుగా గుండెపోటు వస్తుంది. దీనిని ఎమర్జెన్సీ కోరోనరీ అర్టేరీ డీసీజ్ అంటారు. ఇంకొందరికి దీర్ఘకాలం పాటు లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయి. క్రమేపి గుండెపోటుకు దారి తీస్తాయి. ఈ సమస్యను స్టేబుల్ కొరొనరీ ఆర్టెరీ డిసీజ్ అంటారు. ఈ రెండు రకాల వ్యక్తుల సమస్యలు ఒకటే అయినా, వాళ్లకు చేపట్టే పరీక్షల్లో, అందించే చికిత్సల్లో తేడాలుంటాయి.
ఎమర్జెన్సీ కొరొనరీ ఆర్టేరీ డిసీస్
హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తికి మొదట ఈసీజీ, తర్వాత టు డీ ఎ కో కార్డియో గ్రామ్ పరీక్షలు చేసి, గుండె సమస్యను నిర్ధారించుకుంటారు. తర్వాత యాంజియోగ్రామ్ పరీక్షతో ఏ రక్తనాళం ఎంత మేరకు పూడుకుపోయిందో స్పష్టంగా తెలుసుకొని అదే సమయంలోనే ప్రైమరీ యాంజియో ప్లాస్టీ ద్వారా బెలూన్ సహాయంతో కూడికను తొలగిస్తారు. హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తులకు ఈ పరీక్షలన్నీ వెంట వెంటనే పూర్తి చేసి అవసరాన్ని బట్టి స్టెంట్లు వేయడం లేదా ఒకటి కంటే ఎక్కువ రక్తనాళాల్లో పూడికలు ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీని వైద్యులు ఎంచుకుంటారు.
స్టేబుల్ కొరోనరీ ఆర్టేరీ డిసీస్
ఈ తాలూకు గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్లకి ఇసీజీ, టు డీ ఎకో కార్డియో గ్రామ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని క్లిష్టమైన గుండె సమస్యలు ఈ రెండు పరీక్షల్లో బయటపడవు. కానీ లక్షణాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు పరీక్ష ఫలితంతో సంబంధం లేకుండా లక్షణాలను బట్టి, యాంజియోగ్రామ్ అవసరాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. ఆ సమయంలో రక్తనాళాల్లో ఎంత మేర పూడిక ఉందనేది తెలుస్తుంది. అందులో ఉన్న పూడిక ఆధారంగా వైద్యులు తదుపరి చికిత్సను ప్రారంభిస్తారు. ఒకవేళ పూడిక తీవ్రత ఎక్కువ ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు.

ఇంట్రా కొరోనరీ
ఇమేజింగ్ యాంజియోగ్రామ్ తో రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయని తేలినప్పుడు, ఆ పూడిక స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ఇంట్రా కరోనరి ఇమేజింగ్ విధానం తోడ్పడుతుంది. ప్రక్రియలో ఒక చిన్న కెమెరాను రక్తనాళం లోపలికి పంపించి, పరిశీలించే వీలుంటుంది. కాబట్టి పూడికను, దాంతో పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను వైద్యులు స్పష్టంగా గమనించగలరు. అలాగే యాంజియో ప్లాస్టి ద్వారా ఏ సైజు స్టంట్ వేయడం ఉపయోగకరమో, ఎంతవరకు వ్యాకోచింప చేయడం ప్రయోజనకరమో, రక్తనాళం లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టంట్ వేయడం అవసరమో, స్టంట్ వేసిన తర్వాత ఎంతటి ప్రయోజనం దక్కుతుందో ఇంట్రా కొరొనరీ ఇమేజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒకవేళ పూడిక గట్టి పడితే.
రక్తనాళాల్లో క్యాల్షియం పూడికలు బాగా గట్టి పడిపోయినప్పుడు, బెలూన్ యాంజియో ప్లాస్టి ద్వారా తొలగించడం క్లిష్టమవుతుంది. గట్టి పడిపోయిన క్యాల్షియంను బ్రేక్ చేయగలిగే కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి
తిండి తింటే కండ కలదు. కండ కలిగిన వాడే మనిషి. గురజాడ వెంకట అప్పారావు రాసిన సూక్తి ఇది. కానీ ఆ కండ కరిగించిన నాడే మనిషికి ఆరోగ్యం. ఈ విషయాన్ని పూర్తిగా గుర్తుఎరగాలి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. మాంసాహారం తక్కువ తీసుకోవాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తాజా కాయగూరలు తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు శాతం తక్కువ ఉన్న నూనె వాడాలి. గంటల తరబడి కూర్చోకుండా అటు ఇటు నడవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఎక్కువ శబ్దం వచ్చే పరికరాలకు దగ్గరగా ఉండకూడదు. దీనివల్ల శబ్దం తాలూకు తీవ్రత గుండె స్పందనను ప్రభావితం చేస్తుంది. కరోనా తర్వాత గుండె తాలూకు సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి ఊపిరితిత్తుల్లో నిమోనియా తోడవడంతో గుండెపై ఒత్తిడి అధికమవుతుంది. ఫలితంగానే మరణాలు సంభవిస్తున్నాయి.