Anil Ambani: పుట్టుకతోనే కొందరు కష్టాలను కొని తెచ్చుకుంటే మరికొందరు బంగారు చెంచా నోట్లో పెట్టుకొని జన్మిస్తారు. అలా ఫస్ట్ నుంచే సిరిమంతుడు అయిన వాళ్లల్లో ముఖేష్, అనిల్ అంబానీలు అని చెప్పవచ్చు. తండ్రి ధీరూభాయ్ అందించిన వ్యాపార సామ్రాజ్యంతో వీరు ఓనమాలు నేర్చుకొని ఆ తరువాత తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే వీరిలో ముఖేష్ ఇప్పటి వరకు సొంతంగా ఎన్నో ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ప్రతీ ఏటా కుబేరుల స్థానాన్ని కాపాడుకుంటున్నారు.కానీ ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి, కష్టాల కుంపటిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ.. ఇప్పుడు సంపన్నుల జాబితాలో చిట్టచివరి ప్లేసులోకి వెళ్లాడు. అందుకు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పాటు దురదృష్టం వెంటాడమే. ఆయన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను పరిశీలిస్తే..
తండ్రి ధీరుభాయ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇద్దరు కుమారులకు పంచారు. వీరిలో అన్న ముఖేష్ అంబానీ కంటే అనిల్ అంబానీ టాప్ ప్లేసులోకి వెళ్లారు. 2008లో తన సోదరుడిని దాటి 42 బిలియన్ల నికర సంపదతో అత్యంత ధనవంతుల జాబితాలోకి ఎక్కాడు. దీంతో తండ్రి సామ్రాజ్యాన్ని అనిల్ అంబానీ రెట్టింపు చేస్తారని అనుకున్నారు. కానీ ఒక స్థాయికి వెళ్లిన తరువాత అనిల్ అంబానీ దిగజారడం మొదలైంది. దాదాపు 15 ఏళ్లుగా ఆయన ఆర్థిక కష్టాల నుంచి కోలుకోవడం లేదని తెలుస్తోంది.
ముఖేష్ ను కాదని అనిల్ అంబానీ పర్సనల్ గా కొన్ని ప్రాజెక్టులను టేకోవర్ చేశారు. ఇందులో ప్రధానమైంది టెలికాం బిజినెస్. పంపకాల్లో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనిల్ అంబానికి వచ్చింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దక్షిణాప్రికా టెలికాం దిగ్గజం ఎంటీఎన్ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ కంపెనీ న్యాయపరమైన చిక్కుల్లోకూరుకోవడంతో పాటు ఒప్పందాల్లో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భారీ నష్టం ఏర్పడింది. ఆ తరువాత 2జీ కుంభకోణం వెలుగులోకి రావడంతో రిలయన్స్ సంస్థ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్స్ వీడారు. ఆ తరువాత ఇది సీబీఐ విచారణను కూడా ఎదుర్కోవడంతో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి.
ఈ పరిస్థితుల్లో నష్టాల నుంచి గట్టెక్కడానికి అనిల్ అంబానీ రుణాలు తీసుకోవడం ప్రారంభించారు. వ్యక్తిగత హామీ మీద 1.2 బిలియన్ల అప్పులను చైనా బ్యాంకుల నుంచి సమీకరించారు. అయితే అనిల్ చేతిలో ఉన్న సంస్థలు నష్టాల్లో ఉండడంతో ఈ అప్పులు తీర్చలేకపోయారు. దీంతో వారి నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇదిలా ఉండగా ముఖేష్ అంబానీ జియో టెలికాం వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో ఆర్ఐఎల్ పై పెద్ద దెబ్బ పడింది. దీంతో ఈ సంస్థ విలువ 2 శాతానికి పడిపోయింది. ఇలా వరుస నష్టాలు ఎదుర్కొన్న అనిల్ అంబానీ భారీగా అప్పుల్లో కూరుకుపోయారు. వీటిని తీర్చడానికి రిలయన్స్ పవర్ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది.