Mosquitoes: ఈ దోమలు కుడితే ప్రాణాలు పోతాయ్.. జాగ్రత్త.. వీటికి దూరంగా ఉండండి..

ఈ దోమ కుట్టిన వారికి హఠాత్తుగా జ్వరం రావడం, కదలలేని స్థితిలో ఉండడం జరుగుతుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పితో పాటు శరీరంపై దద్దుర్లు, నోరు ఎండిపోతూ ఉంటాయి.

Written By: Srinivas, Updated On : September 25, 2023 12:19 pm
Follow us on

Mosquitoes: వర్షాకాలంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో కీటకాలు విజృంభిస్తాయి. పారిశుధ్యం లోపించిన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తాయి. కీటకాల్లో ముఖ్యంగా దోమలు మనుషులపై వాలి అనేక అనారోగ్యాలను తీసుకొస్తాయి. దోమలు కొట్టినప్పుడు ఎవరూ పట్టించుకోరు. తాత్కాలికంగా కొస్తా నొప్పి ఉండి మాయమవుతుంది. కానీ ఇది మనిషిలోని రక్తాన్ని పీలుస్తుంది. ఈ సమయంలో దోమ ద్వారా శరీరంలోకి క్రిములు వెళ్తాయి. దోమల్లో కొన్ని ప్రాణాంతకమైనవి ఉన్నాయి. ఇవి కుట్టడం ద్వారా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న శరీరాలపై ఇవి కాటు వేస్తే ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. ఇంతకీ దోమల్లో ఏవీ డేంజర్? అవి ఏ సమయంలో సంచరిస్తాయి?

వాతావరణంలో సంచరించే దోమలు అనేక రకాలు ఉంటాయి. వీటిలో అనాఫిలిస్ దోమ ఒకటి. ఇది కుట్టడం ద్వారా మలేరియా వ్యాధి వస్తుంది. ఒక వ్యక్తిని దోమ కుట్టడం ద్వారా దోమలోని వ్యాధికారక పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ అది పెరుగుతుంది. దీంతో మలేరియా వ్యాధి వృద్ధి చెందుతుంది. ఇలా మలేరియా వ్యాధి సోకిన వ్యక్తిని దోమ కుట్టి, ఆ తరువాత మరో వ్యక్తికి కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

ఎడిస్ ఈజిప్ట్ అనే దోమలు చాలా డేంజర్. ఇవి ఆడదోమలు. ఈ దోమలు కుట్టడం ద్వారా ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి వస్తుంది. సరైన చికిత్స లేకపోతే ప్రాణం కూడా పోతుంది. ఈ దోమ కుట్టిన వారికి హఠాత్తుగా జ్వరం రావడం, కదలలేని స్థితిలో ఉండడం జరుగుతుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పితో పాటు శరీరంపై దద్దుర్లు, నోరు ఎండిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ అమాంత పడిపోతాయి.

క్యూలెక్స్ అనే ఆడదోమ కుట్టడం ద్వారా మెదడు వాపు వ్యాధి వస్తుంది. జపనీస్ ఎన్సెఫలైటీస్ వైరస్ ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు అపస్మారక స్థితిలోకి వెళ్తారు. శరీరంలో ఏదో ఒక పక్క పక్షవాతం వస్తుంది. ఇది ఎక్కుగా 2 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్లో కనిపిస్తుంది. వర్షాకాలంలో దాదాపుగా దోమలు నివారించేందుకు ప్రయత్నించాలి. మస్కిటో కాయిల్స్ లేదా దోమ తెరలను వాడాలి.అప్పుడే ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు.