Makar Sankranti 2024: సంకాంత్రి పండగొచ్చింది. పంటలు చేతికొచ్చిన తర్వాత వచ్చే తొలి పండుగ ఇదే. ప్రతీ ఇంట్లో ధాన్యంపు రాశులు నిండుగా ఉంటాయి. అందుకే అన్ని పండుగలకన్నా.. ఈ పండుగను మరింత ప్రత్యేకంగా, ఘనంగా జరుపుకుంటారు. రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన సంక్రాంతి.. ఇప్పుడు అన్నివర్గాల పండుగగా మారింది. ఒకవైపు చిన్న పిల్లలకు భోగిపండ్లు, మరోవైపు కొత్త అల్లుళ్లు.. ఇంకోవైపు కొంటె మరదళ్లు.. భోగి మంటలు.. ముత్యాల ముగ్గులు.. కోడి పందేలు.. గాలిలో రెపరెపలాడే పతంగులు.. ఇలా అన్ని వయసులవారు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇక సంక్రాతికి తెలుగు రాష్ట్రాల్లో పిండి వంటలు ప్రత్యేకం. కొత్త బియ్యంతో పొంగలి, పులిహోర, పాయసాలు.. కనుమ రోజు మాంసంతో వంటకాలు అరిసెలు, చకినాలు ఇలా తీర్కొ పిండి వంటలు చేస్తారు. ఈ నేపథ్యంలో పిండి వంటల కోసం కొన్ని చిట్కాలు..
చిట్కాలు ఇలా..
– నెయ్యి తాజాగా, మంచి వాసన వస్తూ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, వెన్న కాచేటప్పుడు ఓ తాజా తమలపాకును వేసి ఉంచాలి.
– పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
– వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
– వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
– వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.
– పూరీల్లాంటివి వేయించినప్పుడు మూకుడు అడుగున నల్లగా పేరుకుంటుంది. ఐదారు వెల్లుల్లి రెబ్బలు అందులో వేసి కాసేపు పొయ్యిమీద పెట్టండి. కాసేపటికి నల్లని మిశ్రమం అంతా ఆ రెబ్బలకు అంటుకుంటుంది. అప్పుడు వాటిని తీసేసి నూనెను వడకట్టండి.