
Shocking Superstitions: దేశంలో మూఢ నమ్మకాల జాడ్యం పెరిగిపోతోంది. నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా మూఢ నమ్మకాల బారిన పడుతున్నారు. చదువుకున్న వారు సైతం మూఢత్వాన్ని నమ్ముకుంటున్నారు. సాంఘిక దురాచారాల్లో మూఢనమ్మకాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనిషి తన మేథస్సుతో ఎన్నో విషయాలు కనుగొంటున్నా తనలోని అంధత్వాన్ని మాత్రం వదలడం లేదు. ఫలితంగా అనాదిగా మనిషి మూఢ నమ్మకాల జాడ్యంలో పడి కొట్టుకుంటున్నారు.
శాస్ర్త సాంకేతిక ఎంతగా పెరిగినా మనిషి తన మూఢత్వాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. ఏదో జరుగుతుందనే భయంతోనే మూఢ నమ్మకాల బారిన పడి డబ్బు నాశనం చేసుకుంటున్నారు. దెయ్యం, క్షుద్రశక్తులు పట్టాయని రూ.లక్షలు ఖర్చుపెట్టిన సంఘటనలు సైతం మనకు కనిపిస్తాయి. అంటే మూఢ నమ్మకాల మాయలో ఎంతగా మునిగిపోయారో అర్థమవుతోంది.
ఈ మధ్య కాలంలో మూఢ నమ్మకాల(Shocking Superstitions) వలలో చదువుకున్న వారు సైతం పడటం ఆందోళన కలిగిస్తోంది. సొంత తెలివి తేటలున్నా ఎవరో చెప్పినదాన్ని నమ్ముతూ తమ బలహీనతను ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా నష్టాల పాలవుతున్నారు. చదువుకున్నా మూర్ఖులుగానే మిగిలిపోతుండటం గమనార్హం. శకునం సరిగా లేదని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చూస్తుంటే వారి అమాయకత్వం తెలిసిపోతోంది.
కంప్యూటర్ కాలంలో కూడా మూఢ నమ్మకాలను నమ్మడంలో ప్రజల అసమర్థత కనిపిస్తోంది. ప్రతి దానికి వేరే వారిపై ఆధారపడటం, వారు చెప్పింది గుడ్డి నమ్మడం చేస్తూ తమలోని అంధ విశ్వాసాన్ని బయటపెడుతున్నారు. ఎంత చదువుకున్నా ఎవరో చదువురాని వాడు చెప్పే మాటలను విశ్వసిస్తూ విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటే జాలి వేస్తోంది. మూఢ నమ్మకాల జాడ్యాన్ని వదిలించుకోవాలంటే అందరిలో చైతన్యం పెరగాలి. ఆలోచన శక్తి మారాలి.
బయటకువెళ్తుంటే తుమ్ముతుంటే చాలు ప్రయాణం వాయిదా వేసుకుంటారు. ఎదురుగా పిల్లి కనబడితే చాలు బయటకు వెళ్లరు. భర్త చనిపోయిన ఆడది ఎదురొస్తే చాలు ఇక ప్రయాణం వద్దని రద్దు చేసుకుంటారు. కాకి కనబడినా చాలు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మన జనాలకు అలవాటు అయింది. దీంతో మూఢ నమ్మకాల బారిన పడి తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు.