Husband And Wife Relationship: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంతవరకు మన ఒంటరిగా ఉంటాం. వివాహం తరువాత జంటగా మారుతాం. కొత్త కాపురంలో ఉండే మజాయే వేరు. ఇద్దరు కలిసి జీవితాంతం నడిచే ప్రయాణం. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుత రోజుల్లో ఎవరికి కూడా సహనం ఉండటం లేదు. దీంతో రోజు గొడవలు పడుతూ చులకన అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
పెళ్లికి ముందు ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కొంటారో ఓ ప్రణాళిక ఉండాలి. లేకపోతే జీవితం సమస్యలమయంగా మారుతుంది. నలుగురిలో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. దీనికి కారణం మనకు ముందు చూపు లేకపోవడమే. పెళ్లయిన తరువాత సంతానం కలిగితే వారి పెంపకానికి అయ్యే బడ్జెట్ కూడా అంచనా వేసుకోవాలి.
ఉన్న ఊళ్లోనే కాపురం పెట్టాలా లేక ఉపాధి నిమిత్తం వేరే ప్రదేశంలో సెటిల్ కావడమా అనే దానిపై కూడా క్లారిటీ ఉండాలి. పెళ్లయిన తరువాత ఇద్దరి మధ్య తగాదాలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు ముందే తీసుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య అరమరికలు లేకుండా ఉంటుంది. జీవితంలో ముఖ్యమైనది కెరీర్. దాన్ని మలుచుకోవడంలో ఎలాంటి విధానాలు తీసుకుంటారో కూడా ముందే చర్చించుకోవాలి.
వివాహం తరువాత కొత్త బంధం ఏర్పడుతుంది. దీంతో ఇద్దరు తెలియని వారే. ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరగాలంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. అభిప్రాయాలు పంచుకోవాలి. సంసారం అనే బంధానికి భార్యాభర్తలు ఇరుసు లాంటి వారు కావడంతో వీరు పరస్పర అవగాహనతో ఉంటే వారి బంధం పది కాలాల పాటు సుఖంగా ఉంటుంది. కాపురం కలకాలం చల్లగా ఉంటుంది. దీనికి ఇద్దరు కలిసి ఉండటమే కావాలి.