Mahabharata : మహాభారతం మనకు ఎన్నో జీవిత సత్యాలను చెబుతుంది. కురుక్షేత్ర యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతా బోధన మన జీవిన విధానాన్ని, ఆచార వ్యవహారాలను, బంధుత్వాలను, అనుబంధాలను వివరిస్తుంది. ఇంతటి గొప్పది మహాభారతం. అయితే ఇదే మహాభారతంలోని ఓ చిన్న కథ దానంలో ఉన్న గొప్పదనాన్ని మనకు ఉన్న అపోహలను తొలగిస్తుంది. అదేంటో తెలుసుందాం.
ధర్మరాజు అశ్వమేధయాగం..
కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాడవులు విజయం సాధిస్తారు. కానీ, యుద్ధం గెలిచిన ఆనందం కంటే, బాధే పాండవాగ్రజుడు ధర్మరాజును మనస్థాపానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో కలత చెందుతాడు. దీనిని ఎలా పరిహరించుకోవాలో తెలియక మదన పడుతుంటాడు. దీంతో బాధ పోవాలంటే అశ్వమేధయాగం చేయాలని సూచిస్తారు. గొప్పగా అశ్వమేధయాగం చేయడం ద్వారా బాధ నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతారు. దీంతో ధర్మరాజు అశ్వమేధయాగం గొప్పగా నిర్వహించాలని సంకల్పిస్తారు. చుట్టుపక్కల రాజ్యాల రాజులు, చక్రవర్తులు, పండితులు, సిద్ధాంతులను ఈ యాగ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. ధర్మరాజు ఆహ్వానం మేరకు వేల మంది రాజులు, చక్రవర్తులు, పండితులు వస్తారు. ఈమేరకు సమావేశం ఏర్పాటు చేస్తారు.
సమావేశంలో ముంగీస వచ్చి…
అశ్వమేధయాగం ప్రారంభించేందకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక్కసారిగా ఓ ముంగీస ప్రత్యక్షం అవుతుంది. దాని రూపం కూడా విచిత్రంగా ఉంటుంది. కొంత భాగం బంగారు వర్ణంలో మెరుస్తుండగా, కొంత భాగం మామూలుగా ఉంటుంది. అక్కడికి ముంగీస ఎలా వచ్చిందో తెలియక అంతా ఆశ్చర్యంగా చూస్తుంటే.. ఆ ముంగీస మాత్రం.. సభికులను, ధర్మరాజును చూసి పకపకా నవ్వుతుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోయి.. వారు ఎందుకు నవ్వుతున్నావని ప్రశ్నిస్తారు. దీంతో ముంగీస… పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోల్చితే మీరు ఇంత గొప్పగా చేస్తున్న అశ్వమేధయాగం చాలా చిన్నగా అనిపిస్తుందని, దానిని చూసి నవ్వు వస్తుంది చెబుతుంది. దీంతో సభికులు.. బ్రాహ్మణుడు చేసిన దానం ఏంటో చెప్పాలని అడుగుతారు.
జొన్న పిండి ఆహారం..
సభికులు అడిగిన ప్రశ్నకు ముంగీస బ్రాహ్మణుడి దానం గురించి చెబుతుంది. కురుక్షేత్రం జరిగిన స్థలంలో ఓ పేద బ్రాహ్మణుడి కుటుంబం నివాసం ఉండేది. భర్త, భార్య, కొడుకు, కోడలుతో హాయిగా సాగిపోతుంది. నిత్యం పొలాల్లో దొరికే గింజలు తెచ్చుకుని ఆహారంగా తీసుకుంటూ జీవనం సాగించేవారు. కరువు కారణంగా ఒకరోజు ఆ కుటుంబానికి ఆహారం దొరక్క ఇబ్బంది పడింది. బ్రాహ్మణుడు చాలా దూరం వెళ్లగా ఒకచోట జొన్న గింజలు దొరుకుతాయి. అప్పటికే ఇంట్లో అందరూ ఆకలితో అలమటిస్తుంటారు. వెంటనే ఆ జొన్నలు పిండిగా మార్చి.. ఆహారం తయారు చేస్తారు. అందరూ భోజనానికి సిద్ధమవుతున్న వేళ.. ఓ అతిథి ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి వస్తారు. ఆకలిగా ఉందని, కాస్త ఏమైనా పెట్టండి అని అడుగుతారు. అప్పటికే ఆ జొన్న పిండి ఆహారాన్ని నలుగురు నాలుగు భాగాలుగా విభజించుకుని తినడానికి సిద్ధంగా ఉంటారు. వెంటనే పేద బ్రాహ్మణుడు లేచి తన వంతు భాగం ఆ అతిథికి ఇస్తాడు. ఆయన దానిని స్వీకరించి.. ఇంకా ఆకలి తీరలేదని అడుగుతాడు. వెంటనే బ్రాహ్మణుడి భార్య తన వాటా కూడా ఇవ్వమని కోరుతుంది. కానీ, బ్రాహ్మణుడు నిరాకరిస్తాడు. నేను నీకు ఏకష్టం రాకుండా చూసుకుంటానని ప్రమాణం చేశానని చెబుతాడు. దానికి అతని భార్య కూడా నేను మీలో సగమని, మీ కష్టసుఖాల్లోనూ సగం భాగం తనకు వర్తిస్తుందని తెలుపుతుంది. దీంతో సంతోషపడిన బ్రాహ్మణుడు భార్య ఆహార భాగాన్ని కూడా అతిథికి ఇచ్చేస్తాడు. తర్వాత అతిథి ఇంకా ఆహారం కావాలని అడుగుతాడు. దీంతో కొడుకు తన భాగం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు వద్దని వారిస్తాడు. కానీ, కొడుకు నేను మిమ్మల్ని చూసుకోవాలని, కానీ మీరే దానం చేసినప్పుడు, మీ దానం ముందు నేను చేసేది చాలా చిన్నది అని చెబుతాడు. దీంతో బ్రాహ్మణుడు కొడుకు భాగం ఆహారం కూడా అతిథికి ఇస్తాడు. తర్వాత కూడా అకలి అని అతిథి అనడంతో కోడలు కూడా తన వాటా ఇవ్వడానికి వస్తుంది. ఈసారి బ్రాహ్మణుడు గట్టిగా వారిస్తాడు. కానీ, తన భర్త, అత్త,మామలు చేసిన దానం ముందు తన దానం చాలా చిన్నదని, ఈ ఇంటి కోడలుగా అది తన బాధ్యత అని చెబుతుంది. దీంతో బ్రాహ్మణుడు ఆమె భాగం కూడా అతిథికి ఇస్తాడు. వెంటనే అది కూడా స్వీకరించిన అతిథి.. వాని నిజాయతీ పరమైన దానానికి మెచ్చి… స్వర్ణరథం వచ్చిందని, మిమ్మల్ని సజీవంగా స్వర్గానికి తీసుకెళ్తుందని చెబుతాడు. ఈ సందర్భంగా తాను అక్కడే ఉండి.. బ్రాహ్మణ కుటుంబం చిలికిన జొన్న పిండిలో దొర్లానని, దాంతో తన శరీరంలో కొత భాగం వారి గొప్ప దానానికి బంగారుమయమైందని చెబుతుంది. అశ్వమేధయాగంలో వచ్చే పుణ్యంతో శరీరం మొత్తం బంగారుమయం చేసకోవడానికి వచ్చాని చెబుతుంది.
ఆ దానం కన్నా చాలా తక్కువ..
పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోలిస్తే.. ఇక్కడ ధర్మరాజు గొప్పగా చేపట్టిన అశ్వమేధయాగం కార్యక్రమం చాలా చిన్నగా అనిపిస్తుందని ముంగీస చెబుతుంది. దానంలో హంగు ఆర్భాటాలు అవసరం లేదని, మనస్ఫూర్తిగా, నిజాయతీగా చేసే దానం ఎంత చిన్నది అయినా.. గొప్ప పుణ్యం లభిస్తుందని పేర్కొంటుంది. అంటే ఎంత గొప్పగా దానం చేస్తున్నాం అని ఆలోచించకుండా, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నామో ఆలోచించాలని ఈ కథ నీతి మనకు చెబుతుంది.