Chittoor : మారుమూల గ్రామంలో ఓ చెట్టు.. దానికోసం ప్రధానమంత్రి కార్యాలయమే కదిలి వచ్చింది

కేరళలోని మలబార్ తెగ, ఒడిస్సా లో గిరిజనులు, ఈ చెట్టు బెరడు రసాన్ని చెవి నొప్పి నివారణకు వాడుతుంటారు. స్త్రీలలో నెలకొనే అంతర్గత సమస్యల నివారణకు దీనిని ఉపయోగిస్తుంటారు. మూత్రంలో రక్తం పడే వారికి ఈ బెరడు ద్వారా చికిత్స చేస్తారు.

Written By: NARESH, Updated On : June 7, 2024 8:46 am

jallipeta

Follow us on

Chittoor : అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా.. ఆ జిల్లాలో పలమనేరు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో జల్లిపేట అనే పేరుతో గ్రామం ఉంది.. ఈ గ్రామంలో మెజారిటీ ప్రజల వృత్తి వ్యవసాయమే. పల్లెటూరు కావడంతో.. నిండుగా చెట్లతో అలరారుతూ ఉంటుంది.. అయితే ఇందులో ఉన్న ఒక ‘మద్ది చెట్టు’కు అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. ఆ మద్ది చెట్టు ఆ గ్రామానికి చెందిన న్యాయవాది సుబ్రహ్మణ్యం పొలంలో ఉంది.. అయితే ఆ చెట్టు వయసు 150 సంవత్సరాల వరకు ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఆ చెట్టు కోసం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయమే కదిలి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..

సుబ్రహ్మణ్యం పొలంలో ఉన్న మద్ది చెట్టును అతని పూర్వీకులు నాటారట. అప్పటినుంచి ప్రతి తరం దానిని సంరక్షించుకుంటూ వస్తోంది.. అయితే అంతటి చరిత్ర ఉన్న చెట్టుకు ఆపద తలెత్తింది. దీంతో ఒక్కసారిగా సుబ్రహ్మణ్యానికి, ఆ గ్రామ ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే.. కర్ణాటక రాష్ట్రంలోని హోసూర్ ప్రాంతం నుంచి తమిళనాడులోని పెరంబుర్ వరకు 262 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ హైవే ను కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. 2008లో ఈ రహదారి నిర్మాణం కోసం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 150 సంవత్సరాల చరిత్ర చెట్టును పడగొట్టాలని నిర్ణయించారు. ఈ చెట్టుతో సుబ్రహ్మణ్యం, ఆ ఊరి గ్రామ ప్రజలకు అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న నాటి నుంచి వారు ఆవేదన చెందుతూనే ఉన్నారు.. దానిని ఎలాగైనా కాపాడుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఆ చెట్టును సర్వేలో పోకుండా కాపాడుకునేందుకు సుబ్రహ్మణ్యం, గ్రామ ప్రజలు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు, ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందికి లేఖలు రాశారు.. దీంతో వారు స్పందించక తప్పలేదు. హుటాహుటిన ఆ గ్రామానికి వచ్చి.. సుబ్రహ్మణ్యం, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత నివేదికల రూపొందించి అధికారులకు పంపించారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారుల చొరవతో ఆ చెట్టును సంరక్షించారు..

ఆ 150 ఏళ్ల చరిత్ర ఉన్న చెట్టును అర్జున అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం టెర్మినలియా అర్జున. ఈ చెట్టు బెరడు ద్వారా గుండె జబ్బులు నయమవుతాయట.ఈ చెట్టులో ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయట. ఈ చెట్టును కాపాడేందుకు ఒక ఉద్యమం చేయడంతో.. తనకు జాతీయ వృక్ష పురస్కారాన్ని అందజేశారని సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. ఈ అర్జున కాంబ్రేటేసి కుటుంబానికి చెందింది. ఈ చెట్టు బెరడును, కషాయాలను గుండెనొప్పి, రక్తపోటు, డైలీ ఫెడేమియా వంటి వ్యాధుల నివారణ కోసం వాడుతుంటారు. ఈ బెరడు కషాయాలను అల్సర్ వాష్ గా ఉపయోగిస్తుంటారు. ఈ బెరడు బూడిదను పాము లేదా తేలు కుట్టినప్పుడు మందుగా వినియోగిస్తారు.

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఈ చెట్టు బెరడు పొడిని నీటిలో మరిగించి దాని ద్వారా తలనొప్పి, దంతాలలో పురుగులను నివారించేందుకు వాడుతారు. తీవ్రమైన గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పించే ఔషధంగా వినియోగిస్తారు. కేరళలోని మలబార్ తెగ, ఒడిస్సా లో గిరిజనులు, ఈ చెట్టు బెరడు రసాన్ని చెవి నొప్పి నివారణకు వాడుతుంటారు. స్త్రీలలో నెలకొనే అంతర్గత సమస్యల నివారణకు దీనిని ఉపయోగిస్తుంటారు. మూత్రంలో రక్తం పడే వారికి ఈ బెరడు ద్వారా చికిత్స చేస్తారు.