Financial Year End: మరొక్క రోజులో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది అంటే వేతన జీవులు ఒత్తిడికి గురవుతుంటారు. మార్చి 31 లోపు ఐటీఆర్ ఫైలింగ్, పాస్టాగ్ అప్ డేట్, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. అయితే చివరి నిమిషం వల్ల కొన్ని విషయాలు మర్చిపోతుంటారు. ఆ తర్వాత గడువు ముగియడంతో ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా.. ఉద్యోగులు ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేసేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో రిటర్న్ లు దాఖలు చేయడంలో ఆలస్యమైన వారు సవరించిన ఐటీఆర్ లేదా ఐటీఆర్ – యూ ను మార్చి 31 లోగా సమర్పించుకునే అవకాశం ఉంది. ఐటీ కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తే, దానికి సంబంధించిన అసెస్ మెంట్ సంవత్సరం పూర్తయిన నాటి నుంచి.. రెండు సంవత్సరాల వరకు అప్డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ లను ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వారు కూడా ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన వారు.. మార్చి 31 లోగా దానిని దాఖలు చేసుకోవచ్చు.
ఫాస్టాగ్ అప్డేట్
కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల భారీగానే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెంచుకొని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ అప్డేట్ కోసం మార్చి 31 వరకు గడువు విధించింది. ఈలోగా వినియోగదారులు Knw your customer వివరాల మొత్తం పూర్తి చేసుకోవాలి.
ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్లు చేసేందుకు మార్చి 31 వరకే మాత్రమే డెడ్ లైన్ ఉంది. ఆ తేదీలోగా ఇన్వెస్ట్ మెంట్లు చేస్తే.. చెల్లించే పన్నుల్లో ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వివిధ పథకాలలో పొదుపు చేస్తున్నవారు.. ఈ ఏడాది మార్చి 31 లోపు ఈ పథకాల్లో కనీసం మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. లేకుంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి. ఒకవేళ ఆ ఖాతాలను పునరుద్ధరించాలంటే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది. పైగా అనేక ప్రయోజనాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో ప్రతి సంవత్సరం కనిష్టంగా 500 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు జమ చేయవచ్చు. ఒకవేళ గడువులోగా ఆ మొత్తాన్ని జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. తిరిగి ఆ ఖాతాను ప్రారంభించాలంటే 50 రూపాయల వరకు జరిమనాగా చెల్లించాల్సి ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ తెరిచిన మూడవ సంవత్సరం నుంచి రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరవ సంవత్సరం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఎకౌంట్ నిలిచిపోతే.. లోన్ విత్ డ్రా సౌకర్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.
కేంద్రం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనిష్టంగా 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు జమ చేయవచ్చు. అలా జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. ఖాతాలో తిరిగి ప్రారంభించాలంటే 50 రూపాయల అపరాధ రుసుము విధించాల్సి ఉంటుంది. అంటే కనీస డిపాజిట్ మొత్తాన్ని, జరిమానా 50 రూపాయలు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాను తిరిగి ప్రారంభించక పోతే అందులో మొత్తం డబ్బు మెచ్యూరిటీ తర్వాతే విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రారంభించిన 21 సంవత్సరాల తర్వాత లేదా అమ్మాయికి 18 సంవత్సరాల వచ్చిన తర్వాతే ఎకౌంట్ మెచ్యూర్ అవుతుంది.