Corona fund: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారనే సంగతి తెలిసిందే. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు రెండు లక్షలకు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులు సామాన్యుల జీవితాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి.
కొన్ని రాష్ట్రాలు థియేటర్ల విషయంలో ఆంక్షలతో పాటు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కరోనా ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వనుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15వ తేదీ చివరితేదీగా ఉందని వైరల్ అవుతున్న వార్త సారాంశం. కొంతమంది సైబర్ మోసగాళ్లు ఈ తరహా మెసేజ్ లను వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది.
మీకు కూడా ఈ తరహా మెసేజ్ లు వచ్చి ఉంటే జాగ్రత్త పడితే మంచిది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాన్ని అమలు చేయడం లేదని వెల్లడించింది. మోసగాళ్లు పంపించే లింక్ లను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు బ్యాంక్ వివరాలు, ఇతర వివరాలు ఇతరులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వాట్సాప్ కు, మొబైల్ కు వచ్చే మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మోసగాళ్లు ఫేక్ మెసేజ్ లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోవాలి.