India vs England Semi Final 2022: ఈ వార్త కంపోజ్ చేసే సమయానికి దరిదాపు భారత ఆటగాళ్లు, అభిమానుల్లో కూడా నీరసం వచ్చేసింది. హార్దిక్, భువనేశ్వర్ కుమార్, షమీ, అక్షర పటేల్, హర్షదీప్ సింగ్.. గల్లి స్థాయిలో బౌలింగ్ చేస్తుంటే ఇంగ్లీష్ ఆటగాళ్లు మాత్రం ఏం చేస్తారు. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో డీలా పడిపోయి, నిరసపడిపోయి .. అసలు మేము ఇక్కడ దాకా రావడమే గొప్ప అనుకునే రేంజ్ లో ఆట తీరు ఉంటే మాత్రం ఎవరు ఏం చేయగలరు? ఏ ఒక్కరికైనా లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేయాలని లేనట్టుంది. 9 పరుగులకే ఓపెనర్ వికెట్ కోల్పోయి.. విరాట్ కోహ్లీ వస్తే తప్ప ఇన్నింగ్స్ కదలలేని స్థితిలో ఉన్న ఇండియా ఎక్కడ… ఇద్దరు ఓపెనర్లు, అది కూడా 90 పైచిలుకు పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పిన ఇండియా ఎక్కడ.. వెరసి 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతుంది అని అభిమానులు ఆశించిన చోట.. మరోసారి భంగపాటే మిగిలింది.

సోయి ఉందా
టి20 క్రికెట్ మ్యాచ్ లో ఎదురుదాడే ముఖ్యం. ఈ టోర్నీ ప్రారంభం నుంచి భారత ఓపెనర్లు దీనిని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. కనీసం 50 పరుగులు కూడా తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో తొమ్మిది పరుగులకే తొలి వికెట్ రూపంలో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడంటే ఆటపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ కూడా 28 పరుగులు చేసి ఇక నావల్ల కాదు అన్నట్టుగా అవుట్ అయ్యాడు. ఈరోజు జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా నిలబడకుంటే పరిస్థితి మరోలా ఉండేది.
పాకిస్తాన్ మాదిరే
నిన్న జరిగిన తొలి సెమీస్ మ్యాచ్లో న్యూజిలాండ్ 150 పై చిలుకు పరుగులు చేసింది. ఇదే సమయంలో చేజింగ్ కి దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఫలితంగా పడుతూ లేస్తూ సాగిన పాకిస్తాన్ ఏకంగా ఫైనల్ వెళ్ళింది. ఇదే సమయంలో ఈరోజు జరిగిన మ్యాచ్లో నిన్నటి ఫలితమే పునరావృతమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు భారత్ను 168 పరుగులకే కట్టడి చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు ఓపెనర్లు దాటిగా ఆడటంతో భారత్ బౌలింగ్ తేలిపోయింది. ఐదుగురు బౌలర్లు పోటీపడి పరుగులు సమర్పించడంతో ఇంగ్లీష్ జట్టు వీర విహారం చేసింది.

సాధిస్తుంది అనుకునే దశ నుంచి సెమిస్ లోనే ఇండియా ఇంటికి వచ్చేసింది. కర్ణుడు చావుకి కారణాలు అనేకం ఉన్నట్టు.. భారత జట్టు ఓటమికి కూడా అనేక కారణాలు. అక్షర్ పటేల్ ను కొనసాగించడం, భువనేశ్వర్ కుమార్ తో డెత్ ఓవర్లు వేయించడం.. ఒకటా రెండా.. ఫలితంగా 15 సంవత్సరాల నిరీక్షణ నిరీక్షణగానే మిగిలింది. ఈ టోర్నీలో భారత్ కు ఏమైన సానుకూల పరిణామం ఉందంటే అది పాకిస్తాన్ పై గెలుపు మాత్రమే