T20 World Cup 2022 India vs England: “ఇట్స్ ఓకే, ఓకే” అంటూ నటాషా ఇచ్చిన రియాక్షన్ మనలో చాలా మంది చూశాం. రీప్లే వేసి మరీ చూపించారు కూడా ! అప్పటికే దాదాపు 200 స్ట్రైక్ రేటుతో కొట్టాడు. లాస్ట్ బాల్ వికెట్లు తగిలి సెల్ఫ్ అవుట్ అయ్యాడు. హ్యూమన్ ఎర్రర్. అందుకే ఆమె వెంటనే రియాక్ట్ అయిపోయింది. ఫైర్ ఉన్న ప్లేయర్ ఎంత ఫీల్ అవుతాడో, గిల్ట్ పెట్టుకుంటాడో పక్కనుండే ఆమెకి బాగా అర్థమవుతుంది కదా ! అందుకే మిసెస్ పాండ్యా అలా అన్నది. ఇదంతా ఫస్ట్ హాఫ్. కనీసం మాటలు, ఎక్స్ ప్రెషన్స్ అయినా ఉన్నాయ్. ఇంగ్లండ్ ఉతికేశాక అవి కూడా లేవు.

ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అనే మాట ఒకటుంది. ముందు అది అర్థం కావాలి మనకి. ఈ మ్యాచ్ చూశాక చాలా మందికి రగిలింది. పాక్ తో మ్యాచ్ అంటే ఫైనల్ అంటే బీపీ షుగర్లు పెరిగేవి, మా ఆరోగ్యాల కోసం మీరిలా చేశారు. థ్యాంక్స్ అనే వెటకారాల మొదలు, రోహిత్ శర్మ పొట్ట గురించి, కోహ్లీ టీ20 కెరీర్ గురించి, ద్రవిడ్ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నారు. జడ్జిమెంట్లు ఇస్తున్నారు. బాస్… అంత కన్నా ముందు తేల్చుతోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయ్. టీమ్ సెలెక్షన్, ప్రిపరేషన్, రొటేషన్, కౌన్సెలింగ్ లాంటివి. ఇవే అసలు గేమ్ ఛేంజర్స్. ఇవి తెలవకుండా, మాట్లాడకుండా ఆవేశంగా తిట్టేస్తే ఇప్పటికి ఓకేనేమో ! 24లో విండీస్ అమెరికాలో జరిగే వరల్డ్ కప్ లోనూ ఇలాగే వాపస్ వస్తారు ఖాయంగా!
ప్రెజర్ హ్యాండ్లింగ్ ఎవరూ ఎవరికీ నేర్పించలేరు అన్నాడు కెప్టెన్ రోహిత్. హ్యాండిల్ చేయలేకే ఓడామని చెప్తున్నాడు. నీ కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నారు బాస్… సైకలాజికల్ గా ఓ ఎలైట్ జట్టు ఎంత బలంగా ఉండాలి ? మీరేంటి 11 అప్పడాలు పేర్చిన మేడలా ఉన్నారేంటి ? ఎందుకంటే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి మీరెట్ల బ్యాట్లు వేలాడేసుకొని రెడీ అయ్యారో, ఇంగ్లాండ్ తో సెమీస్ కి కూడా మీరు అలాగే సిద్ధం అయ్యారు. మీకో కండిషనింగు, బట్లర్ అండ్ కో ఉతుకుడు కానీ మన బలహీనతలను కవర్ చేసుకునే ఆలోచన కానీ లేనేలేవు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లలో సైకాలజిస్టుకి ఫైనల్ అలెవెన్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ తెలియని మెంటలోళ్లం. అందుకే ఈ కర్మ !

ఇక టీమ్ ప్రిపరేషన్ అండ్ సెలెక్షన్. హు ఈజ్ అక్షర్ పటేల్ ? ఇండియాలో దుమ్ములేచే పిచ్చుల మీద టెస్టుల్లో తీసుకొని, వాడితో 5 వికెట్లు తీయించావంటే అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా గారబ్బాయి మామూలోడు కాదు అనుకోవచ్చు. మీకు వరల్డ్ కప్ తో ఆటలేంట్రా ? అశ్వినేమో రోహిత్ కోటా. ఇప్పటికే అన్యాయం జరిగింది రవికి అని వరల్డ్ కప్ కి తీసుకెళ్తే టీమ్ మెత్తానికి జరిగింది అన్యాయం. రాహుల్ కి అల్టర్ నేటివ్ లేదా ? మళ్లీ ఏక కాలంలో మూడు టీములు అందుబాటులో ఉంటాయనే భోషాణం కబుర్లు చెబుతుందెందుకు బోర్డు ? పేస్ డిపార్టుమెంటు సరేసరి ! బుమ్రా లేకపోతే దిక్కే లేదు. ఐపీఎల్ లో ఇన్ స్టంట్ గాళ్లని తీసుకొని ప్రపంచాన్ని గెలుద్దామని పోతే వరల్డ్ కప్ ఒంగోబెట్టింది అనే సామెత పుట్టింది ఇపుడు. అందరూ ఫేలైపోయి అర్షదీప్ మహావృక్షం అయిపోయాడు కానీ అసలు అది కూడా ఆముదం మొక్కే ! సిరాజ్ ఎక్కడున్నాడో చాహర్ సంగతేంటో కుల్దీప్ పరిస్థితి ఏంటో మాలిక్ ఎంత వరకూ అందుకుంటాడో ఇప్పటికైనా అంచనాకొస్తే బెటర్.
ఆలోచన లేకుండా ఆవేశపడినా పని జరగదు. ఆల్రెడీ 36 వచ్చిన రోహిత్ మరో కప్పు ఆడతాడో లేదో ! మరి కుర్ర జట్టేదో చూసుకుంటే బెటర్. ఇదే అదునుగా కోహ్లీ స్ట్రైక్ రేటు మీద పడితే లాభం లేదు. ఎవడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొందరు 40 వచ్చే వరకూ ఆడతారు. షోయబ్, టేలర్ లాంటోళ్లే ఉండగా కోహ్లీ లాంటి ఇండస్ట్రియస్ ప్లేయర్ ఉండడా ?
అయినా ఇంత అనుకుంటాం కానీ, దానెబ్బ టాసేదో గెలిచి ఛేజింగ్ తీసుకుంటే అసలు ఇంత పోస్టుమార్టమే ఉండకపోదు ! అంతేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయా ఏంటి ! అయినా ఆన్ లైన్ ఎగ్జామ్ పెట్టండి, కెమెరా పని చేయకపోతే నా ప్రతాపం చూపిస్తా అంటే కుదరదుగా ! ఇది కూడా అంతే ! ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి బౌలింగ్ వీక్ నెస్ బొక్క బోర్లా వేసింది. ఇట్స్ ఒకే టు బి నాట్ ఓకే !