T20 World Cup 2022 India vs England: టీమిండియా నిరుత్సాహ పరచింది. సెమీస్ లోనే ఇంటి దారి పట్టడం అభిమానులకు నిరాశే మిగిల్చింది. కప్ గెలుస్తుందనే ఆశలపై నీళ్లు చల్లింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో వెన్ను చూపి వెనుదిరిగింది. బాగా ఆడే వారిని పక్కన పెట్టి ఇతరులకు చాన్స్ ఇవ్వడంపై భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇంకా నయం ఫైనల్ లో పాకిస్తాన్ పై ఓడి వచ్చే బదులు సెమీస్ లోనే ఇంటి దారి పట్టడం మంచిదైందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. క్రీడాకారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. పేలవమైన ప్రదర్శనతో ఇంటికి రావడం నిజంగా దారుణమంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెమీస్ కు చేరినా ఇంగ్లండ్ చేతిలో పరాభవం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఇంగ్లండ్ ను నిలువరించే క్రమంలో ఎలాంటి కట్టడి చేయలేదు. దీంతో ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా లక్ష్యం చేధించడమే అందరిని ఆశ్చర్యపరచింది. కీలక ఆటగాళ్లను పక్కన పెట్టి ఏ మాత్రం ప్రభావం చూపని వారిని జట్టులోకి తీసుకోవడంతోనే విమర్శల పాలైంది. ఇప్పుడు ఇంటి దారి పట్టి అందరిలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గాయాల బారిన పడి కొందరు దూరమైనా ఫామ్ లో ఉన్న వారిని సైతం జట్టులోకి చేర్చుకోకపోవడమే వివాదాలకు కారణమవుతోంది.
టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటే వారు చాలా మంది ఉన్నా అలసిపోయారనే ఉద్దేశంతో ఎంపికలో పొరపాట్లు చేశారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. పేలవ ప్రదర్శన చేసే వారికి అవకాశాలు కల్పించి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం ఆందోళనలకు తావిస్తోంది. బుమ్రా, దీపక్ చాహర్, జడేజా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నందున వారిని ఎంపిక చేయలేదు. అర్షదీప్ ఒక్కడే జట్టులో స్థిరపడ్డాడు. దీపక్ హుడాను తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా ఆటగాళ్ల ఎంపిక ఉండటంతోనే అపజయం కలిగింది. ప్రయోగాలు చేసి చివరకు కప్ తేకుండానే ఇంటికి తిరిగి రావడం అందరిలో కోపానికి కారణమవుతోంది. షమి, అశ్విన్ లను ప్రపంచ కప్ కు ఎంపిక చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. జట్టుకు బాగా ఉపయోగపడే వారిని కాదని ఏ మాత్రం ప్రభావం చూపని వారిని ఎంపిక చేయడం విమర్శలకు దారి తీసింది. చాహల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లాంటి మణికట్టు స్పిన్నర్లున్నా అశ్విన్, అక్షర పటేల్ లను తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.