Sunstroke: వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగా ఈ సారి వేసవి కాస్త ముందుగానే వచ్చింది. సాధారణంగా ఎండాకాలం ఏప్రిల్ నెలలో మొదలై మే నెలలో ఎండలు ముదురుతాయి. కానీ ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలోనే వేసవి ప్రతాపం మొదలైంది. దీని వలన ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు.
అలా అని ఇంట్లో ఉన్న కూడా ఎండ వేడిమికి గురి అవుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు వేడిని తట్టుకోలేరు. జ్వరం, చర్మ సమస్యలు లేదా వడదెబ్బకు గురి అవుతారు. మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లి వచ్చినప్పుడు కొందరు తలనొప్పితో బాధపడుతారు. సూర్యకిరణాలు తలపై నేరుగా పడటం వలన తలనొప్పి రావడంతో పాటు కొన్ని సార్లు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. అయితే వడదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ లో చెమట రూపంలో శరీరంలో ఉండే లవణాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ కారణంగా నీరసంతో పాటు వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అందుకోసం తరచుగా ఓఆర్ఎస్ నీళ్లు, కొబ్బరి నీళ్లను లేదా నిమ్మరసం తాగుతుండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాటన్ దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు..కారం, మసాలా వంటి పదార్థాలు తినడం తగ్గించాలి.
వేడిని నియంత్రించే శక్తిని శరీరం కోల్పోవడం వలన వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒకవేళ వడదెబ్బకు గురి అయితే ఓఆర్ఎస్ నీళ్లు తాగాలి. అనంతరం వెంటనే వైద్యుని వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. వడదెబ్బను ఆశ్రద్ధ చేయకూడదని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలియజేస్తున్నారు.