LuLu Group: హైదరాబాద్ నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల నుంచి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. యూఏఈలో ప్రముఖంగా ఉన్న ‘లులూ గ్రూపు’ తమ షాపింగ్ మాల్ ను హైదరాబాద్ లో బుధవారం ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ లో గృహోపకరమైన అన్ని రకాల వస్తువులు ఉంటాయి. రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ కూకట్ పల్లి లో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైపర్ మార్కెట్ ఉంటుంది. ఈ మాల్ ద్వారా స్థానికంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ తరుణంలో అసలు లులూ గ్రూప్ ఎవరిది? ఇది ఎలా ప్రారంభమైంది? అనేది ఆసక్తిగా మారింది.
లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ అనేది బహుళజాతి సమ్మేళన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబిలో ఉంది. 1995లో ఎం.ఏ. యూసఫ్ అలీ దీనిని స్థాపించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఈయన డిగ్రీ పూర్తి చేసిన తరువాత 1973లో అబుదాబి కి వెళ్లారు. ఆ తరువాత అక్కడ తన మామ ఎం.కె.అబ్దుల్లా యాజమాన్యంలోని ఎగుమతులు, దిగుమతులు చేసే లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పనిచేశాడు.ఈ అనుభవంతో యూసఫ్ అలీ మొదటిసారిగా 1990లో అబుదాబిలో హైపర్ మార్కెట్ ను ప్రారంభించాడు.
అలా ప్రారంభించిన ఈ మార్కెట్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 255 లులూ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 57,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అసియాలోనే అతిపెద్ద చైన్ మార్కెట్ గా లులూ ప్రసిద్ధి చెందింది. భారత్ లో లులూ గ్రూప్ షాపింగ్ మాల్స్ 5 ప్రధాన నగరాల్లో నెలకొల్పారు. మొట్టమొదటిసారిగా లులూ గ్రూప్ ను యూసుఫ్ అలీ తన సొంత రాష్ట్రమైన కేరళలోని కొచ్చిలో ప్రారంభించారు. ఆ తరువాత బెంగుళూరు, తిరువనంతపురం, లక్నో, త్రిస్సూర్ లో కొనసాగిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రారంభించారు. రిటైల్ మార్కెట్ లో ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన లులూ హైపర్ మార్కెట్ కస్టమర్లకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను అందిస్తుందని అంటుంటారు. డిజిటల్ ఎలక్ట్రానిక్ యంత్రాలు ఉపయోగించి కస్టమర్లకు ఇబ్బంది లేకుండా బిల్లులను రూపొందిస్తుంది. ఈ షాపింగ్ మాల్ కు వచ్చే వారు ఆహ్లాదంగా గడపడానికి ఇందులో మంచి ఆహారం అందించే హోటళ్లు, వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంచుతారు.