Mothers Day 2024: అందరినీ కనే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది అని ఓ సినీకవి అన్నట్లు అమ్మ ఓ వ్యక్తి కాదు శక్తి. లోకాన్ని నడిపించే అద్వితీయమైన శక్తి. అమ్మ అనే పిలుపులో ఎంతో మాధుర్యం. పిలిచే భాష వేరైనా భావం మాత్రం ఒక్కటే. సృష్టిలో ప్రతీ జీవికి అమ్మ విలువల తెలుసు. అమ్మ ప్రేమ తెలుసు. బిడ్డల కోసం సర్వం త్యాగం చేసేది తల్లి మాత్రమే. కానీ ఏనాడు నా బిడ్డల కోసం నేను ఇది చేశాను అని చెప్పుకోదు. బిడ్డల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టేది ఒక్క తల్లి మాత్రమే. బిడ్డలే లోకంగా బతికేతి కన్న తల్లి మాత్రమే. అమ్మ కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చేసుకునే వేడుక మదర్స్ డే.
1907లో..
మదర్స్ డే దాదాపు 117 ఏళ్ల కిందట అమెరికాలో మొదలైంది. అందుకు స్ఫూర్తి అన్నా జార్విస్. 1907, మే 12న ఆ అమెరికన్ మహిళ తన తల్లి కోసం ఒక మెమోరియల్ సర్వీస్ నిర్వహించడం ప్రారంభించింది. దీంతో మదర్స్ డే అనే ఆలోచన ప్రారంభమైంది. ఆ తర్వాత అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఏటా మే నెల రెండో ఆదివారం అమ్మను గుర్తుచేసుకునేందుకు కొన్ని కార్యక్రమాలు చేయడం మొదలైంది. ఈ క్రమంలో 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు దీనిని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.
తల్లి నుంచి వచ్చిన ఆలోచన
అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన జార్విస్కు తన తల్లి నుంచే వచ్చింది. జార్విన్ తల్లి అనేకమంది తల్లులను చైతన్యపరుస్తూ వారు తమ పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకునేలా చేసేవారు. ఈ విసయాన్ని చరిత్రకారిణి, వెస్ట్ వర్జీనియా వెస్లియాన్ కాలేజీ ప్రొఫెసర్ క్యాథరీన్ ఆంటోలినీ తెలిపారు. అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని జార్విస్ 1858లో మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించారు. అప్పటి నుంచి మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు. శిశు మరణాల రేటు తగ్గించడానికి పనిచేసేవారు.
జార్విస్ మరణం తర్వాత..
1905లో జార్విస్ మరణించారు. ఆమె చుట్టూ ఉన్న నలుగురు పిల్లలు రిజ్వాస్ తల్లి స్ఫూర్తిని కొనసాగిస్తామని మాట ఇచ్చారు. అన్నా జార్విస్ తల్లి ఇతరుల జీవితాలు మెరుగుపడేలా చేసిన పనికి గుర్తింపు దక్కాలని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకోగా, అన్నా జార్విస్ మాత్రం ‘అత్యుత్తమ మాతృమూర్తి ఎవరైనా సరే ఆమె మీకు తల్లే’ అనే భావనతో ఈ మదర్స్ డేను జరపడం ప్రారంభించారు.