
IPL : ఐపీఎల్–2023 సీజన్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గుజరాత్, చెన్నై మధ్య జరుగనుంది. అయితే, ఐపీఎల్–2023 సీజన్ ప్రారంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలకు ఓ బ్యాడ్ న్యూస్. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్ వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తమ జట్టు స్టార్ ఆటగాళ్లను భాగం చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే తమ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బీసీసీఐకి కూడా తెలియజేసినట్లు సమాచారం.
వరల్డ్ కప్ అర్హత మ్యాచ్..
ఈ ఏడాది చివరన వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ టోర్నీకి క్వాలిఫై కావాలంటే దక్షిణాప్రికా నెదర్లాండ్స్‌తో తప్పనిసరిగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఐసీసీ వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా క్వాలీఫై అవుతుంది. నిలకడ లేని, కీలక మ్యాచ్‌లలో ఒత్తిడికి లోనయ్యే జట్టుగా పేరున్న సౌత్ ఆఫ్రికాకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ చాలా కీలకం. అందుకే ఐపీఎల్‌కు ముందు జరిగే ఈ టోర్నీలో బలమైన జట్టుతోనే బరిలోకి దిగాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లు ఆడకపోవచ్చని తెలుస్తోంది.

ఐపీఎల్ ఆటగాళ్లు వీరే..
ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు కలిగి ఉన్న కగిసో రబడ, లుంగీ ఎంగిడి, రాస్సీ వాన్ డేర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, ఐడెన్‌మార్కరమ్, స్టాబ్స్, మార్కో జాన్సన్, క్లాసన్ వంటి ప్రోటీస్ ఆటగాళ్లు నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ లో భాగమయ్యే చాన్స్ ఉంది. కాగా ప్రోటీస్ స్టార్ బ్యాటర్ హేడెన్ మార్కరం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ నుంచి ఎస్‌ఆర్‌హెచ్ సారధిగా మార్కరం తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మార్కరం దూరం కావడం దాదాపు కాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎస్ ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వెటరన్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉంది.